
ప్రైవేటు పాఠశాల బస్సు దగ్ధం
కుక్కునూరు: మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సులో విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చిన అనంతరం డ్రైవర్ గణపవరంలో బస్సు నిలిపి ఉంచాడు. రాత్రి 7 గంటల తరువాత బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పివేశారు. మంటలు అంటుకోవడానికి షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. ఇదే ప్రమాదం విద్యార్థులు ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు కాలం చెల్లిన వాహనాలకు రంగులు వేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. బస్సులకు అటెండర్‌లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం గత వారం రోజుల క్రితం వరకు బస్సును వారి పేరు మీదకు మార్పు చేయకుండానే స్ప్రింగ్ లీఫ్ అనే తెలంగాణ అడ్రస్ తో ఉన్న బస్సును వినియోగించింది. ఇందుకు రవాణా శాఖ నిర్లక్ష్యమేనని పలువురు వాఖ్యానిస్తున్నారు.