
ఇది ప్రభుత్వ వైఫల్యమే
దెందులూరు: కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందక నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఏలూరు రూరల్ మాదేపల్లి, కాట్లంపూడి, లింగారావుగూడెం గ్రామాల్లో బీటలు వారిన సాగు పొలాలను రైతు సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న సాగునీటిని కేఈ కెనాల్‌లోకి మళ్లించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని కోరారు. ఇరిగేషన్ అధికారుల ప్రణాళికా లోపంతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని, ఇది ప్రభుత్వం, అధికారుల వైఫల్యమేనని విమర్శించారు. పంట కాలువలు తూడు, గురప్రు డెక్క, నాచు, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయని చెప్పారు. వేసవికాలంలో తగిన విధంగా కాలువల బాగు చేసే పనులు చేపట్టలేదని చెప్పారు. గురప్రు డెక్కను తొలగించకుండా కలుపు మందు చల్లారని, ఈ నీటినే ఏలూరు రూరల్ మండలంలోని ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారని, అత్యంత ప్రమాదకర కలుపు మందులు చల్లడం దారుణమన్నారు. కార్యక్రమంలో అన్నం రెడ్డి రంగారావు, సుంకర నరసింహారావు, వి.రామారావు, పి.భాస్కరరావు, టి.రంగారావు, బైరెడ్డి కష్ణారావు పాల్గొన్నారు.