
ఆటపాక కేంద్రంలో ఆహ్లాదం ఆవిరి
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామం ఆటపాక పక్షుల విహారం కేంద్రం కళావిహీనంగా మారింది. గత ఏడాది ఇదే రోజుల్లో పక్షుల విహార చెరువు నీటితో కళకళలాడింది. అధికారుల ముందస్తు ప్రణాళిక లోపించడంతో ఏటా చెరువు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల కొల్లేరు సమస్యలపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) సభ్యులకు నీరు లేకుండా సహజ అందాలను కోల్పోయిన పక్షుల కేంద్రాన్ని చూపించారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కేంద్రం సందర్శనకు వచ్చి బోటు షికారు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
ఆటపాక పక్షుల విహార కేంద్రం రాష్ట్రంలోనే వినుతి కెక్కింది. ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అరుదైన పెలికాన్ పక్షులు ఆటపాకకు రావడం, సంతానోత్పత్తి తర్వాత తిరిగి వెళ్ళడం క్రమం తప్పకుండా జరిగేది. దీంతో ఆటపాక పక్షుల కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలిచేవారు. పక్షుల కేంద్రంలో విహార చెరువు 286 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పక్షుల ఆవాసాలకు 158 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆటపాక పక్షుల కేంద్ర సందర్శననకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఏటా విచ్చేస్తున్నారు.
నీటి సరఫరాలో నిర్లక్ష్యం
ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో నీటిని నింపడం ఏటా అటవీ శాఖకు తలనొప్పిగా మారుతోంది. ఇక్కడ చెరువులో 6 అడుగులు నింపే కెపాసిటి ఉంది. సమీపంలోని పోల్‌రాజ్ డ్రైయిన్‌లో నీటని అటవీ శాఖ చెరువుకు ఏర్పాటు చేసిన తూములు తెరిచి నీటిని నింపుతారు. సాధారణంగా జూలై నెలలో పక్షుల విహార చెరువు పూర్తిగా నీటితో నిండుతుంది. అలాంటిది ఈ ఏడాది జూలై నెల ముగింపు దశకు వస్తున్నా కేవలం అడుగు నీరు మాత్రమే ఉంది. నీరు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పక్షులు హాయిగా విహరించే అవకాశం లేదు. ఆటపాక గ్రామంలో పంట కాల్వలో నీరు పుష్పలంగా ఉంది. జాన్‌పేట సమీపం నుంచి బోదె ద్వారా కాల్వ నీటిని నింపుకునే అవకాశం ఉంది. పక్షుల కేంద్రం సమీపంలో ఆక్వా చెరువులలో నిండుగా నీరు ఉండటం, పక్షుల విహార చెరువులో మాత్రం నీరు లేకపోవడం బాధకరమని పలువురు వాపోతున్నారు.
బోటు షికారు లేదు
ఈ కేంద్రంలో బోటు షికారు ప్రత్యేకం.పెలికాన్, పెయింటెడ్ స్టార్క్‌తో సహా పలు రకాల పక్షుల్ని దగ్గర నుంచి వీక్షింవచ్చు. దీంతో ప్రతి ఒక్కరూ బోటు షికారు కోసం క్యూ కడతారు. కొన్ని నెలలుగా బోట్లు మూలనపడ్డాయి. సందర్శకుల ప్రవేశం, బోటు షికారు రేట్లను పెంచారని అందుకు తగ్గట్లుగా మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
జూలై సగం గడిచినా నిండని విహార చెరువు
నిరాశగా వెనుదిరుగుతున్న పర్యాటకులు
వర్షాలు పడకపోవడం వల్లే..
ప్రతీ ఏటా విస్తార వర్షాల కారణంగా పోల్‌రాజ్ డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా వచ్చేది. ఆ సమయంలో పక్షుల దొడ్డి తూము తెరిచి నీటిని నింపుతాం. అలాంటిది పోల్‌రాజ్‌లో అనుకున్న నీరు రాలేదు. పక్షుల కేంద్రానికి విచ్చేసే పర్యాటకుల కోసం మరో కొత్త విహార బోటును తీసుకొస్తున్నాం. ఇప్పుటికే రెండు బోట్లు ఉన్నాయి. రహదారుల అభివృద్ది, ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం ప్రతిపాదనలు పంపాం. – ఎం.రంజిత్‌కుమార్, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, కై కలూరు

ఆటపాక కేంద్రంలో ఆహ్లాదం ఆవిరి

ఆటపాక కేంద్రంలో ఆహ్లాదం ఆవిరి