
గిరిజనులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
భీమవరం(ప్రకాశం చౌక్): గిరిజనులను కూటమి ప్రభుత్వం విస్మరించి, వారికి రిజర్వేషన్లు అమలు చేయడంలో అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవనంలో సాలా శ్రీను అధ్యక్షతన శుక్రవారం గిరిజన తెగల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వీరన్న మాట్లాడుతూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి గిరిజన మహిళకు రిజర్వేషన్ కాగా దీనిని మార్చి ఓసీ మహిళకు కేటాయించారన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్, జేసీలకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్టీ వర్గాలు రాజకీయ పదవులకు అర్హులు కాదా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ పదవితో పాటు శాసనమండలిలో కూడా గిరిజనులకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఎస్టీ వర్గాలకు అన్యాయం
వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అలాగే మహిళలకు 50 రిజర్వేషన్ అమలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ఈ రిజర్వేషన్లు మార్పులు చేసి కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు అన్యాయం చేస్తోందన్నారు. ఎస్టీ వర్గాలు రాజకీయంగా చైతన్యం కావాలని వారికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ భీమవరం ఇన్‌చార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించి తదుపరి ఓసీ మహిళకు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమ న్నారు. ఎస్టీ వర్గాలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చులకన భావనకు ఇదే నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మేడిది జాన్సన్ మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం జరిగిందని, తాము అండగా ఉంటామన్నారు. పార్టీ నేత గంటా సుందర్‌కుమార్ మాట్లాడుతూ దళిత జేఏసీ తరఫున పూర్తి బాధ్యత తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భారతి విజయరాజు, ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కూతాడ పెద్ద సత్యనారాయణ, సాల వెంకటేశ్వరరావు, కారంపూడి అనంత నాగు, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.