
బదిలీ చేశారు.. జీతాలు ఆపారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఇటీవల జరిగిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలను ఆలస్యం చేస్తోందని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలను సాకుగా చూపి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
పొజిషన్ ఐడీలు కేటాయించడంలో..
సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని నిమిత్తం పొజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపులో అన్ని క్యాడర్ల ఉపాధ్యా యుల బదిలీలను పూర్తి చేశారు. ఇది జరిగి నెల రోజులు దాటినా ఇప్పటికీ ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్‌కు సంబంధించి జూలైలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు విజ్ఞప్తులు చేసినా చలనం కలుగలేదు. ఇప్పటివరకూ ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంగ్త్ కూడా నిర్ధారించిన దాఖలాలు లేవని సంఘ నాయకులు అంటు న్నారు. ఈ కారణంగా వచ్చే నెల కూడా తమకు జీతాలు అందే సూచనలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జీతాలందక పాట్లు
సాధారణంగా జూన్‌లో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలిగిస్తోందని ఉపా ధ్యాయులు అంటున్నారు.
4,884 మందిపై ప్రభావం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో మొత్తం 4,884 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 76 మందికి, మో డల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,274 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,159 మందికి, లాంగ్వేజ్ పండితులు 42 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 33 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఒకేషనల్ ఉపాఽ ద్యాయులు 16 మందికి స్థాన చలనం కలిగింది. జీతాలు విడుదల కాకపోవడం వీరిపై పెను ప్రభావం చూపుతోంది.
పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం
గురువులకు జీతాలు లేక అగచాట్లు
4,884 మంది ఉపాధ్యాయులపై ప్రభావం
ఉపాధ్యాయులపై ఒత్తిడి
పాఠశాల విద్యాశాఖ అధికారులు తాము చేయాల్సిన పనిని సక్రమంగా చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడిలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు విరమించాలి. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయకుండా వారిపై యాప్‌ల అప్‌లోడ్ పేరిట భారం పెంచుతున్నారు. వెరీ అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్‌లు పెట్టడం తప్ప ఉపాధ్యాయుల జీతాలు అర్జెంట్ అనే విషయాన్ని మరచిపోతున్నారు.
– తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు
జీతాలు వెంటనే చెల్లించాలి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికగా ఇటీవల నిర్వహించిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించే ఏర్పాటుచేయాలి. జీతాలు లేని కారణంగా సుమారు 5 వేల ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. జీతాలు రాక ఈఎంఐలు కట్టడానికి కూడా లేక డిఫాల్ట్ అవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకోకుండా ఆదుకోవాలి.
– గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

బదిలీ చేశారు.. జీతాలు ఆపారు

బదిలీ చేశారు.. జీతాలు ఆపారు