కల్లుగీత.. బెల్టు వ్యథ | - | Sakshi
Sakshi News home page

కల్లుగీత.. బెల్టు వ్యథ

Jul 19 2025 1:09 PM | Updated on Jul 19 2025 1:09 PM

కల్లు

కల్లుగీత.. బెల్టు వ్యథ

సాక్షి, భీమవరం: జిల్లాలో విచ్చలవిడిగా సాగు తున్న మద్యం అమ్మకాలు కల్లుగీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బెల్టు షాపుల ద్వారా ఊరువాడా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతోంది. దీంతో సంప్రదాయ కల్లుతాగే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గీత కార్మికులు వాపోతున్నారు.

170 సంఘాలు.. 10 వేల కార్మికులు

జిల్లాలో 170 కల్లుగీత కార్మిక సంఘాల పరిధిలో 10 వేల మంది వరకు గీత కార్మికులు ఉన్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట తదితర నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ప్రాణాలకు తెగించి గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కి కల్లును తీసి పొలం గట్లు, రోడ్లు వెంబడి మకాంలలో అమ్మకాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని ఉన్నారు. గ్రామాల్లో కళకళలాడే కల్లుగీతను కూటమి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేసిందని కార్మిక సంఘం నేతలు విమర్శిస్తున్నారు.

బెల్టు బారులు.. మద్యం ఏరులు

జిల్లాలో 193 మద్యం దుకాణాలకు గాను పట్టణ ప్రాంతాల్లో దాదాపు 71 షాపులు ఉండగా, 410 పంచాయతీల పరిధిలో 122 షాపులు ఉన్నాయి. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్‌ సిండికేట్లు బెల్టు షాపులు ఏర్పాటుచేసి అమ్మకాలు చేయిస్తున్నారు. లైసెన్స్‌డ్‌ షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు ఉన్నట్టు సమాచారం. సముద్ర తీరం, మెట్ట ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో బెల్టు షాపుల కోసం లోపాయికారీగా వేలం పాటలు కూడా జరిగాయి. తీర ప్రాంతంలోని ఒక గ్రామంలో రూ.17.80 లక్షలకు, మరో గ్రామంలో రూ.6 లక్షలకు బెల్టు షాపులు దక్కించుకున్నట్టు గీత కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు చిన్న చిన్న బడ్డీ దుకాణాల్లో మద్యం సీసాలు పెట్టి అమ్మకాలు చేయడంతో పాటు కావాల్సిన చోటుకి డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు.

గీత కార్మికుల డిమాండ్లు

బెల్టుషాపులను రద్దు చేసి కల్లుగీత కు టుంబాలను ఆదుకోవాలని, బెల్టులతో నష్టపోయి న కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహకారం అందించాలని, బెల్టుషాపుల ఎత్తివేతకు గ్రామస్థాయిలోని ఉద్యోగులతో కమిటీలు ఏర్పాటుచేయాలని, వృత్తి నిర్వహణలో ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందితే వారి కు టుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఇటీవల కలెక్టర్‌కు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.

కల్లు.. తల్లకిందులు

జిల్లాలో మద్యం ఏరులై పారుతుండటంతో కల్లు అమ్మకాలు గణనీయంగా తగ్గినట్టు కార్మికులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేవని, బెల్టుషాపుల జాడే ఉండేది కాదన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అమ్మకాలు చేయడం వలన గీత కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. గతంలో ప్రధాన రహదారుల వెంబడి ఒక్కో మకాంలో రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు, గ్రామాల్లో రూ.1,500లు నుంచి రూ. 2,000ల వరకు అమ్మకాలు చేస్తే.. కూటమి ప్రభుత్వంలో రూ.200ల నుంచి రూ.300 అమ్మకాలు జరగడం గగనమవుతోందని చెబుతున్నారు. గోదావరి చెంతనే రక్షిత నీటి కోసం ఇబ్బందులున్నా కానీ మద్యానికి కొదవ ఉండటం లేదంటున్నారు. బెల్టులు ఏర్పాటుచేసిన మద్యం షాపులకు మొదటిసారి రూ.5 లక్షలు జురిమానా విధించాలని, రెండోసారి తప్పుచేస్తే లైసెన్స్‌ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఎకై ్సజ్‌ అధికారులు 370 మందిని అరెస్టు చేసి 730 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నా ఒక్క షాపునకు జరిమా విధించడం గాని, లైసెన్స్‌ రద్దు చేసిన దాఖలాలు కాని లేకపోవడం కూటమి సర్కారు ద్వంద్వ నీతికి నిదర్శనమంటున్నారు.

ఉపాధికి గండి

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు

తమ ఉపాధి దెబ్బతింటోందని గీత కార్మికుల ఆవేదన

నష్టపోతున్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌

జిల్లాలో 10 వేల మంది గీత కార్మికులు

గీత కార్మికులంటే చంద్రబాబుకు చిన్నచూపు

కల్లుగీత కార్మికులంటే చంద్రబాబుకు చిన్నచూపు. మద్యం ఆదాయం కోసం కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణ, కేరళలో కల్లుగీత కార్మికులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉన్న వాటిని అమలు చేయకుండా గీత కార్మికులకు అన్యాయం చేస్తోంది.

–జుత్తిగ నరసింహమూర్తి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భీమవరం

ఎల్లవేళలా మద్యం అమ్మకాలు

బెల్టు షాపులు వచ్చాక కల్లు తాగే వారు బాగా తగ్గిపోయారు. ఎక్కడపడితే అక్కడ చిన్న చిన్న బడ్డీకొట్టుల్లో ఎల్లవేళలా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. కల్లు దుకాణంలో గతంలో రోజుకు రూ.2 వేల వరకు అమ్మకాలు చేస్తే ఇప్పుడు రూ.200 కూడా అమ్ముడుపోవడం లేదు.

–బి.రత్నం, కల్లుగీత కార్మికుడు, ఆరేడు, ఉండి మండలం

కల్లుగీత.. బెల్టు వ్యథ 1
1/2

కల్లుగీత.. బెల్టు వ్యథ

కల్లుగీత.. బెల్టు వ్యథ 2
2/2

కల్లుగీత.. బెల్టు వ్యథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement