
భార్య దారుణ హత్య
ఆస్తిని పెద్ద కుమారుడికిరాసివ్వమని అడగడమే కారణం
అనంతరం ఆత్మహత్యకు యత్నించిన భర్త
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కుమారుడికి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం అతడికి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది.
ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్య దారుణ హత్య