ఉండి: పనికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం పెరవలి మండలం పిట్లవేమవరానికి చెందిన కుడుపూడి సత్యశంకర్ (22) ఉండి మండలం కోలమూరులో మోటార్ రీవైండింగ్ పనులు చేసే షాపులో పని చేస్తున్నాడు. పనికి సరిగా వెళ్లడం లేదని తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనిచేసే దుకాణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన గణేష్ అనే వ్యక్తి దుకాణం యజమానికి సమాచారం అందించాడు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు, అనంతరం గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టల్ ఉద్యోగిని ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు కొత్తపేటకు చెందిన పోస్టల్ ఉద్యోగిని కృష్ణ సంగీత (29) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్‌ఆర్‌పేటలోని పోస్టల్ కార్యాలయంలో అసిస్టెంట్ పోస్టల్ అధికారిగా పనిచేస్తున్న ఆమె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తండ్రి, న్యాయవాది పుచ్చల వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ సంగీతకు విశాఖపట్నంకు చెందిన నక్కిన శశికిరణ్‌తో 2024 డిసెంబర్ 5న వివాహమైంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శశికిరణ్ పెళ్లయిన కొద్దిరోజులకే ఉద్యోగం మానేసి ఖాళీగా ఉండేవాడు. ఎన్‌ఆర్ పేట పోస్టల్ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణ సంగీతను ఉద్యోగం మానేసి విశాఖపట్నం రావాలని ఒత్తిడి చేసేవాడు. ఆమె జీతాన్ని సైతం భర్తకే పంపేదని.. కట్నకానుకలుగా ఇచ్చిన స్థలాలు సైతం అతని పేరుమీద రాయాలని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త వేరే మహిళలతో ఉంటున్న ఫొటోలను పంపి వేధించేవాడని.. భర్తతో పాటు అత్తమామలు సైతం అదనపు కట్నం కావాలని వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


