వాట్సాప్ గవర్నెన్స్ సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ చేతుల మీదుగా మనమిత్ర స్టాండ్‌లు మండలాల వారీగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ధ్రువపత్రాలు వాట్సప్ ద్వారానే ప్రజలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనమిత్రను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే, వాట్సాప్‌లోనే అప్లై చేసుకోవచ్చని అన్నారు. దేవదాయ, రెవెన్యూ, మున్సిపల్, తదితర శాఖలలో చెల్లింపులు, జనన, మరణాల ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, వివిధ రకాల ధ్రువపత్రాలు జారీ సేవలు పొందవచ్చన్నారు. పౌరులకు లభించే సేవలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, వివిధ మండలాల ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.


