ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25 తేదీల్లో మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. చొదిమెళ్లలో నాయకులు శనివారం పర్యటించారు. ధర్నా, రాస్తారోకోలను జయప్రదం చేయాలని రైతులను కోరారు. కోకో గింజల కొనుగోలు, ధరల సమస్యలపై ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ సమక్షంలో చర్చలు జరిగినా కోకో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. సంఘ నాయకులు కోనేరు సతీష్‌బాబు, పి.నాని, పి.సుధాకర్ పాల్గొన్నారు.