భీమవరం: నియోజకవర్గంలో శాసనసభ్యుని తర్వాత స్థానం మార్కెటింగ్ యార్డ్ (ఏఎంసీ) చైర్మన్ పదవి. జిల్లాలోని ఏఎంసీల్లో ఈ పదవి పోటీకి అనేక మంది ఆశావహులు ఉన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది.
● భీమవరంలో ఏఎంసీ పదవిని ఆశిస్తున్న వారిలో పొత్తూరి బాపిరాజు, ఇందుకూరి రామలింగరాజు (టీడీపీ), బండి రమేష్‌నాయుడు (జనసేన) ఉన్నారు. అయితే ఇక్కడ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు.
● ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు ఏఎంసీ చైర్మన్ పదవిని బొల్లా వెంకట్రావు (బీసీ), ఉండి ఏఎంసీ చైర్మన్ పదవిని జుత్తుగ నాగరాజు (జనసేన), కలిదిండి శ్రీనివాసరాజు (టీడీపీ) ఆశిస్తున్నారు. అయితే ఆకివీడు బీసీ జనరల్‌కు, ఉండి జనరల్‌కు రిజర్వు చేయడంతో నాగరాజు ఆశలు గల్లంతయ్యాయి.
● నరసాపురం ఏఎంసీ చైర్మన్ పదవిని టీడీపీ నుంచి కొప్పాడ రవీంద్ర (బీసీ), జనసేన నుంచి వలవల నాని (ఓసీ) ఆశిస్తున్నారు. ఇక్కడ ఓసీ జనరల్‌కు కేటాయించడంతో కొత్తముఖాలు తెరపైకి వచ్చే అవకాశముంది.
● పెనుగొండలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మింగుడు పడటం లేదు. ఇప్పటివరకు ఓసీకి చెందిన టీడీపీ ఆశావహులు బడేటి బ్రహ్మాజీ, గంటా వాసు, కోయ పోతురాజు, మైగాపుల రాము, జనసేన నుంచి గుర్రాల సూరిబాబు, కొండవీటి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు.
● ఆచంట ఏఎంసీ చైర్మన్ పదవికి టీడీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన కేతా మీరయ్య, దొంగ నాగార్జున, పెచ్చెట్టి సుబ్రహ్మణ్యం, కోళ్ల సత్యనారాయణ, గుడాల శ్రీనివాస్, జనసేన నుంచి చిట్టూరి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఆచంట నియోజవర్గంలో ఉన్న రెండు ఏఎంసీల్లో ఒక్కటి తప్పనిసరిగా జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు.
● తణుకులో పదవి కోసం ఓసీ వర్గాల్లో పలువురు ఆశగా ఎదురుచూస్తుండగా ఇక్కడ ఎస్సీ మహిళకు రి జర్వు చేయడం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలే చెబుతు న్నాయి. ఇక్కడ అబ్బదాసరి లాజర్, నత్త చంద్రశేఖర్, కొండేటి శివ వారి సతీమణులలో ఒకరికి పదవి కేటాయించే అవకాశం ఉందని తెలిసింది.
● తాడేపల్లిగూడెంలో పదవికి జనసేన నుంచి పలువురు ఆశావహులు ఉండగా ఇక్కడ ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేయడంతో కొత్తముఖాలు తెరపైకి రానున్నాయి.
పాలకొల్లులో..
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు శాసనసభ్యునిగా కాపు సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా పనిచేశారు. రెండో స్థానమైన ఏఎంసీ చైర్మన్‌గా క్షత్రియులు, కాపులు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు చేశారు. ప్రస్తుతం పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. పదవిని జనసేన లేదా బీజేపీకి ఇస్తారని ఆయా పార్టీల నేతలు ఎదురుచూస్తుండగా ఇప్పటివరకూ వారితో సంప్రదింపులు జరగలేదు. టీడీపీలో పెచ్చెట్టి బాబు, కోడి విజయభాస్కరరావు, మామిడిశెట్టి పెద్దిరాజు బరిలో ఉన్నారు. వీరంతా శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారు. ఇదిలా ఉండగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆలోచనా ధోరణి ఏంటన్నది, ఎలా ఉందన్నది బయటపడటం లేదు.
రిజర్వేషన్లతో ఆశావహుల ఆశలు గల్లంతు