కై కలూరు: బంగారపు దుకాణాల వద్దకు కారులో దర్జాగా వెళతారు.. అత్యవసరం అంటూ రూ.3 లక్షల విలువ చేసే బ్రాస్‌లెట్ తాకట్టు పెట్టుకుని కేవలం రూ.1.50 లక్షలు ఇవ్వండనీ అడుగుతారు. హాల్‌మార్క్ గుర్తుతో పాటు హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన రశీదు ఇస్తారు. చివరికు అది ఒన్ గ్రామ్ బంగారంగా తేలుతోంది. ఈ విధంగా ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో మోసాలకు పాల్పడిన ముఠాను కై కలూరు టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టౌన్ సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్‌కుమార్, డి.శ్రీనులతో కలసి కేసు వివరాలను స్టేషన్‌లో గురువారం వెల్లడించారు. నెల్లూరు జిల్లా రామవరప్పాడుకు చెందిన కడియాల వెంకటేశ్వరరావు(40) భార్యతో కలసి హైదరాబాదు ఎల్‌బీ నగర్‌లో ఒన్ గ్రామ్ బంగారం దుకాణం నడుపుతున్నాడు. పెద్ద తిరుపతిలో కొండపైకి భక్తులను జీపుల్లో తరలించే విజయనగం జిల్లా మెంటాడకు చెందిన చొక్కాపు మణికంఠ(32), నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఉన్నం చంద్రమోహన్(54)లను కలుపుకుని వెంకటేశ్వరరావు మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 13న కై కలూరు మహాలక్ష్మీ గోల్డ్ షాప్‌లో బ్రాస్‌లెట్ తాకట్టు పెట్టి రూ.90 వేలు యజమాని మెంట దీలిప్ నుంచి తీసుకున్నారు. తర్వాత సమీపంలోని కార్తీకేయ ఫైనాన్స్ యజమాని శివవరప్రసాద్‌కు చైన్ తాకట్టు పెట్టి రూ.1,50 లక్షలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతనికి అనుమానం రావడంతో చాకుతో బెదిరించి పరారయ్యారు. తర్వాత భీమవరంలో రూ.1.50 లక్షలు, గుడివాడలో రూ.1.50 లక్షలు, గణపవరంలో రూ.1.30 లక్షలకు నకిలీ బంగారు వస్తువులు అంటగట్టి నగదుతో పరారయ్యారు. తిరిగి కై కలూరులో మోసాలకు పాల్పడడానికి గురువారం వచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.88 వేలు నగదు, 4 చైన్లు, 4 బ్రాస్‌లెట్లు, 3 సెల్‌ఫోన్లు, తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్‌కుమార్, డి.శ్రీనులను ఎస్పీ అభినందించారు.
గోల్డ్ షాపులే టార్గెట్‌గా మోసాలు
కై కలూరు పోలీసులకు చిక్కిన ఘరానా కేటుగాళ్లు