భీమవరం(ప్రకాశం చౌక్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్‌టీఆర్ వైద్య సేవలో పనిచేసే ఆరోగ్య మిత్రలు, సిబ్బంది సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ట్రస్ట్ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేదన్నారు. దీంతో శాంతియుత నిరసనల్లో భాగంగా విధుల బహిష్కరణ, జిల్లా సమన్వయకర్త ఆఫీసుల వద్ద నిరసనలు, ఈనెల 27న ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మంగళగిరి వద్ద నిరసనలు చేపట్టనున్నామన్నారు.
రోగుల పడిగాపులు : వైద్యసేవ సిబ్బంది విధుల బహిష్కరణతో జిల్లావ్యాప్తంగా 28 నెట్‌వర్క్ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వాస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ సేవలు అందక రోగులు ఇబ్బంది పడ్డారు. అత్యవసర వైద్యం కోసం రూ.300 నుంచి రూ.500 వెచ్చించి ఓపీ కార్డు తీసుకుని వైద్యుడిని కలిశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నడూ ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని, కూటమి ప్రభుత్వ తీరుతో ఇబ్బంది పడుతున్నామని పలువురు వాపోయారు. ఈనెల 24న కూడా ఎన్‌టీఆర్ వైద్యసేవ సిబ్బంది మరోమారు విధుల బహిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ రోజూ రోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
గళమెత్తిన వైద్య సేవ సిబ్బంది