● చానల్స్ ఆధునికీకరణతో నీటిపారుదల సుగమం
● ప్రత్నామ్యాయ మార్గాలే మేలంటున్న రైతులు
తాడేపల్లిగూడెం రూరల్: ఎర్రకాలువ ముంపు కారణంగా ఏటా వందలాది ఎకరాల పంట నీట మునుగుతుంది. గతేడాది ఎర్రకాలువ గట్టుకు గండ్లు పడి వరి నాట్లు నీట మునగడంతో పాటు ఇసుక మేటలు వేశాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు నీటిని దారి మళ్లించడం వల్ల గట్లు సురక్షితంగా ఉంటాయని రైతులు అంటున్నారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం నుంచి నందమూరు వరకు ఎర్రకాలువ ఆయకట్టు ఉంది. దీని పరిధిలో బంగారుగూడెం, వీరంపాలెం, పట్టెంపాలెం, అప్పారావుపేట, జగన్నాథపురం, మాధవరం, కొ త్తూరు, మారంపల్లి, నవాబుపాలెం, నందమూరు తదితర గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఎర్రకాలువ గట్టుకు గండ్లు పడి పంట నీట మునగడం పరిపాటిగా మారింది. పట్టెంపాలెం, అప్పారావుపేట, బాపన్నకోడు, మాధవరం తదితర ప్రాంతాల్లో సబ్ చానల్స్ ఉన్నాయి. ముంపు నివారణలో సబ్ చానల్స్ ఎంతగానో ఉపకరిస్తాయని, అయితే సబ్ చానల్స్ నిర్వహణకు నోచుకోకపోవడంతో ముంపు తీవ్రస్థాయిలో ఉంటుందని రైతులు చెబుతున్నారు. సబ్ చానల్స్ ద్వారా ఎర్రకాలువ వరద నీరు ఏలూరు ప్రధాన కాలువలో కలిసే అవకాశం ఉందని, దీంతో గట్లకు గండ్లు పడే అవకాశం తక్కువని అంటున్నారు. ఎర్రకాలువ గట్లను పటిష్టం చేయాల్సి వస్తే రాయితో నిర్మాణం చేయాలని, ఇది వందలాది కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అంటున్నారు.
రూ.10 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు
బంగారుగూడెం నుంచి నందమూరు వరకు ఉన్న ఎర్రకాలువ గట్టుకు పడిన 27 గండ్లను తాత్కాలికంగా పూడ్చేందుకు రూ.10 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపినట్టు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయడం ద్వారా ముంపు నివారించే అవకాశం ఉంది. లేకుంటే ఖరీఫ్ సీజన్ లోనూ ఎర్రకాలువ ముంపు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సబ్ చానల్స్‌ను ఆధునికీకరించాలి
ఎర్ర కాలువ వరద నీరు సబ్ చానల్స్ నుంచి మళ్లించడం వల్ల ముంపును నివారించవచ్చు. సబ్ చానల్స్ ఆధునికీకరణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రానున్న వర్షాకాలంలోనూ ముంపు తప్పదు.
– గొరసా ఆదినారాయణ, అప్పారావుపేట
సబ్ చానల్స్‌తో ముంపు నివారణ