జన గోదావరి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

జన గోదావరి సిద్ధం

Feb 3 2024 1:08 AM | Updated on Feb 3 2024 10:07 AM

- - Sakshi

వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఏలూరు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు తరలిరానున్నారు. ఏలూరు ఆటోనగర్‌–దెందులూరు సమీపంలోని 110 ఎకరాల సహారా గ్రౌండ్స్‌లో సభా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సాక్షిప్రతినిధి, ఏలూరు : జన జాతరకు.. జన గోదా వరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొ త్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు. ఏలూరు ఆటోనగర్‌–దెందులూ రు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేస్తున్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పదుల సంఖ్యలో గ్యాలరీలు, సిట్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. సభావేదిక నిర్మాణం, వేదిక ముందు భా గంలో ‘ఫ్యాన్‌’ గుర్తులో వాకింగ్‌వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు. సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే మేం సిద్ధం అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదు ల సంఖ్యలో సీఎం జగన్‌ భారీ కటౌట్‌లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ సిద్ధమైంది.

ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మిథున్‌రెడ్డి, తలశిల
శుక్రవారం అధికార యంత్రాంగం, పోలీసులు సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ను నిర్వహించారు. పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, పార్టీ ముఖ్య నేతలు సభా ఏర్పాట్లను పరిశీలించారు.

కనీవినీ ఎరుగని రీతిలో
కోస్తాంధ్రలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో పార్టీ కేడర్‌తో జరిగే అతిపెద్ద బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. 50 నియోజకవర్గాల ఇన్‌చార్జులకు రూట్‌మ్యాప్‌, పార్కింగ్‌ వివరాలను పంపి నియోజకవర్గాల వారీగా ఆయా పార్కింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్లను ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి పరిశీలించారు.

భారీ బందోబస్తు
ఏలూరు టౌన్‌:
సిద్ధం బహిరంగ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి తెలిపారు. సభా ప్రాంగణం వద్ద శుక్రవారం పోలీస్‌ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సభకు లక్షలాది మంది రానున్నారని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏలూరు జాతీయ రహదారి పక్కన సభ నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మొత్తం 3,298 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామన్నారు. అదనపు ఎస్పీలు–7, డీఎస్పీలు–23, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు–78, ఆర్‌ఎస్సైలు–197, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు–478, కానిస్టేబుళ్లు–1,119, మహిళా కానిస్టేబుళ్లు–199, హోంగార్డులు–80, మహిళా హోంగార్డులు–60, ఏఆర్‌ సిబ్బంది –167, స్పెషల్‌ పార్టీ సిబ్బంది–164 మందితో పాటు అదనంగా మరికొందరిని రిజర్వులో ఉంచామన్నారు. ఏఎస్పీ స్వరూపరాణి, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పాల్గొన్నారు.

ఏలూరు ముస్తాబు
సభా ప్రాంగణంతో పాటు ఏలూరు నగరం, దెందులూరు జాతీయ రహదారి ‘సిద్ధం’ సభకు ముస్తాబైంది. వైఎస్సార్‌సీపీ జెండాలు, పార్టీ ఫ్లెక్సీలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కటౌట్‌లను భారీగా ఏర్పాటు చేయడంతో రాజకీయ సందడి వాతావరణం నెలకొంది.

ముఖ్యమంత్రి షెడ్యూల్‌
● మధ్యాహ్నం 3.20 గంటలకు దెందులూరులోని హెలీప్యాడ్‌కు సీఎం జగన్‌ చేరుకుంటారు.

● 3.25 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

● 3.30 గంటల నుంచి 4.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

● 4.50 గంటలకు అక్కడ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

● 4.55 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

● సాయంత్రం 5 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement