
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి
భీమవరం (ప్రకాశం చౌక్): ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు రాబట్టాలని జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి మూడో దశ రీ సర్వే స్టోన్ ప్లాంటేషన్, బీహెచ్‌పీఎస్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్షన్లు, అసైన్డ్ భూములు, సివిల్ సప్లయి, అడంగల్ కరెక్షన్, జగనన్న కాలనీలు, గృహ నిర్మాణాలు, స్థల సేకరణ, టూరిజం ప్రాజెక్ట్స్, స్పందన గ్రీవెన్స్ తదితర 20 అంశాలపై మండలాల వారీగా సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడో దశ రీ సర్వేలో 20 మండలాల్లో 104 గ్రామాలు త్వరితగతిన రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నోటీసులను సకాలంలో అందజేయకపోతే సదరు ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జాయింటు కలెక్టరు హెచ్చరించారు. మూడో దశ రీ సర్వే నవంబరు 30 నాటికి పూర్తి చేయాలన్నారు. నాలుగో దశ రీ సర్వే జనవరి 1న మొదలు పెట్టడానికి అధికారులు, సిబ్బంది సంసిద్ధులు కావాలన్నారు. రైతులు పంట కోసిన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో మాత్రమే గన్ని బ్యాగులను అందజేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి, ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఆర్డీఓలు చొరవ చూపాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మార్పులు, చేర్పులు, తొలగింపులు ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు చేపట్టాలన్నారు. త్వరితగతిన కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవిన్యూ అధికారి కె.కృష్ణవేణి, ఆర్డీవో కె.శ్రీనివాసులు రాజు, గ్రామ, వార్డు సచివాయాల జిల్లా అధికారి, ఇన్‌చార్జి జిల్లా సహకార శాఖ అధికారి కేసీహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా తదితరులు పాల్గొన్నారు.