భద్రత ప్రశ్నార్థకం! | - | Sakshi
Sakshi News home page

భద్రత ప్రశ్నార్థకం!

Oct 7 2026 2:22 AM | Updated on Oct 7 2026 2:22 AM

భద్రత ప్రశ్నార్థకం!

●

గురుకులాల్లో పిల్లలను పర్యవేక్షించే వ్యవస్థ ఏం చేస్తోంది?

● టీచర్‌ దాడి, ఎలుకల కాటు, అనారోగ్యం, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు

● వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మంచి విద్య, వసతి, భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకులాల్లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలుకల కాటు నుంచి ఆహార కలుషితంతో అస్వస్థత, విద్యార్థుల మధ్య ఘర్షణలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.

విస్తృతం ‘గురుకుల’ నెట్‌వర్క్‌..

హనుమకొండ, వరంగల్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో బీసీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదిక ప్రకారం ఆయా సొసైటీల జాబితాలను పరిశీలిస్తే పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్‌ సంస్థలు కలిపి సంఖ్య 61 ఉండగా 24,400 మంది విద్యార్థిని,విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐ పరిధిలోనే ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో 31 గురుకులాల్లో 12,400 వరకు విద్యార్థులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గేట్‌ దగ్గరే తల్లిదండ్రులు..

గురుకులాల్లో చదివే పిల్లలు వారాల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు తెలియదు. కొన్నిచోట్ల తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడంతో పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడేందుకు వచ్చిన పేరెంట్స్‌ గేటు బయటే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా మారడం వల్ల కూడా అనర్థాలకు కారణంగా చెబుతున్నారు. దీంతో లోపల వారి పిల్లలు ఎలా ఉంటున్నారు? భోజనం ఎలా ఉంది? వసతి గదులు, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? ఎవరైనా వేధిస్తున్నారా? అనారోగ్యంగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పిల్లల్ని నమ్మి పంపుతున్నాం..

‘పిల్లలను నమ్మి గురుకులాలకు పంపుతున్నాం.. మా కళ్లకు దూరంగా ఉన్నా.. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో భద్రంగా ఉన్నారనే నమ్మకం కల్పించాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ఘటన జరగకుండా చూడాలి’ అని హనుమకొండ జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలలో చేరిన ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గురుకులాల్లో చేర్పించిన పిల్లలందరూ రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. పిల్లలకు మంచి భవిష్యత్‌ వస్తుందనే ఆశతో వారిని దూరంగా పంపుతున్నాం. అప్పుడప్పుడు కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. నిర్వహణలో మార్పు లేదు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకుని పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’ అని వరంగల్‌ జిల్లాకు చెందిన పేర్లు చెప్పని ఓ గురుకుల విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాదం కింద ఎలుక కొరికిందని చూపిస్తున్న గూడూరులోని ఎంజేపీ బాలికల పాఠశాల విద్యార్థిని సాయి హర్షిత

నెక్కొండ బాలికల గురుకుల పాఠశాలలో టీచర్‌ కొట్టగా గాయమైందని చేతిని చూపిస్తున్న బాలిక

ఈ ఏడాది కలవరపెట్టిన ఘటనలు కొన్ని

● ఏప్రిల్‌ 26 : మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు మహాత్మా జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి రాచర్ల కార్తీక్‌ మృతి కలకలం రేపింది. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

● జూన్‌ 30 : పరకాల మండలం మల్లక్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని శ్రీవాణి బాత్‌రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది.

● ఆగస్టు 3: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 27 మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి రాగా ఆరోపణలపై విచారించారు.

● సెప్టెంబర్‌ 19: హనుమకొండ జిల్లా వంగర పీవీ రంగారావు బాలికల గురుకులంలో చదువుతున్న ఓ విద్యార్థిని సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి గురుకులంలో చేర్చుకోవాలనే విషయంలో ప్రిన్సిపాల్‌ నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం వివాదాస్పదమైంది.

● సెప్టెంబర్‌ 24: జనగామ జిల్లా పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థులను ఎలుకలు కరవడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు బాలికలను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించినట్లు ప్రకటించారు.

● అక్టోబర్‌ 5: వరంగల్‌ జిల్లా ఖానాపురంలో ఇద్దరు గిరిజన బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఫోన్‌ ద్వారా వేధింపులే ఘటనకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి.

● అక్టోబర్‌ 5: మహబూబాబాద్‌ జిల్లా గూడూరులోని బీసీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఐదో తరగతి బాలికను ఎలుక కరిచింది.

● అక్టోబర్‌ 6: నెక్కొండ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 35 మంది ఐదో తరగతి విద్యార్థినులను ఇంగ్లిష్‌ టీచర్‌ రజిని తీవ్ర గాయ పర్చింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కలెక్టర్‌ సత్యశారద ఎంపీడీఓను విచారణ అధికారిగా నియమించారు. విచారణ నివేదిక మేరకు టీచర్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement