అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్ : రోజువారీ లక్ష్యంతో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి సర్వేయర్లు, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్కతుర్తి మండలం కోతులనడుమ, హనుమకొండ మండలం పలివేల్పులలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన భూముల కొలతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను సర్వేయర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి రీ సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎన్.రవి మాట్లాడుతూ సర్వేయర్లు ప్రతిరోజూ 70 ఎకరాల భూమిని కొలిచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. రెండు రోవర్లను వినియోగిస్తూ సర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వే బృందాలు ఉదయం 9 గంటలలోపే క్షేత్రస్థాయికి చేరుకుని రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మరుసటి రోజు చేపట్టే సర్వే వివరాలను ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, భూముల కొలతల శాఖ ఏడీ నూర్‌సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎల్కతుర్తి నాయబ్ తహసీల్దార్ రమేశ్, సర్వేయర్లు, ఆర్‌ఐలు, రైతులు పాల్గొన్నారు.


