పొగ, మద్యం ముప్పు | - | Sakshi
Sakshi News home page

పొగ, మద్యం ముప్పు

Oct 7 2026 2:22 AM | Updated on Oct 7 2026 2:22 AM

సాక్షి, వరంగల్‌: పొగాకు.. మద్యం.. రెండూ ఆరోగ్యానికి హానికరమే. అయినప్పటికీ 15 ఏళ్లు పైబడిన వారిలో వీటి వినియోగం పూర్తిగా తగ్గలేదు. 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం వరంగల్‌ జిల్లాలో 40.7 శాతం, హనుమకొండ జిల్లాలో 44.8 శాతంగా నమోదైంది. మహిళల్లోనూ వరంగల్‌లో మద్యం వినియోగం 12.7 శాతం ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–6) వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ జిల్లాతో పొల్చుకుంటే మద్యం, పొగాకు వినియోగంలో హనుమకొండ జిల్లాలో పెరగడం గమనార్హం. యువత ఈ అలవాట్ల బారిన పడకుండా ముందస్తు అవగాహన, కౌన్సెలింగ్‌తో పాటు విక్రయాల నియంత్రణపై పోలీస్‌, ఎకై ్సజ్‌, వైద్య శాఖలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయా విభాగ ఉన్నతాధికారుల మార్గదర్శనంలో వీటిని కట్టడి చేయాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది. ముఖ్యంగా పాఠశాలలతో పాటు బహిరంగ ప్రదేశాల్లోనూ పొగ సేవించడం ఎక్కువ వడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీటిపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఎంతో మంది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారనే విమర్శలున్నాయి.

తగ్గినా... ఇంకా గణనీయమే!

వరంగల్‌ జిల్లాలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 8.1 శాతం మంది ఏదో ఒక రకమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. పురుషుల్లో ఈ శాతం 24.2గా ఉంది. ఇక మద్యం విషయానికి వస్తే మహిళల్లో 12.7 శాతం, పురుషుల్లో 40.7 శాతం మంది వినియోగిస్తున్నారు. అయితే ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–5తో పోలి స్తే ఆయా విభాగాల్లో తగ్గుదల నమోదైనా పురుషుల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీ యంగానే ఉండటం ఆందోళనకర అంశంగా మారింది.

గతంతో పొలిస్తే పెరిగింది..

హనుమకొండ జిల్లాలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో పొగాకు వినియోగం 1.7 శాతం, పురుషుల్లో 15.9 శాతంగా ఉంది. మద్యం సేవించే మహిళలు 3.3 శాతం ఉండగా, పురుషుల్లో ఏకంగా 44.8 శాతం ఉన్నారు. అంటే ఇక్కడ పురుషుల్లో మద్యం వినియోగం వరంగల్‌ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఉంది. ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–5తో పోలిస్తే హనుమకొండలో పురుషుల పొగాకు వినియోగం 14 నుంచి 15.9 శాతానికి, మద్యం వినియోగం 43.3 నుంచి 44.8 శాతానికి పెరిగింది.

15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం ఆందోళనకరం

వరంగల్‌ జిల్లాలో 40.7 శాతం... హనుమకొండ జిల్లాలో 44.8శాతం

పొగాకు వినియోగం వరంగల్‌లో 24.2 శాతం, హనుమకొండలో

15.9 శాతం

పోలీస్‌, ఎకై ్సజ్‌, ఆరోగ్య శాఖల

సమన్వయ చర్యలు తీసుకుంటేనే నియంత్రణ

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 గణాంకాలతో అంతటా చర్చ

అనారోగ్య సమస్యలే..

పొగాకు వినియోగంతో క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం, గుండెతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రజలు ఈ విషయాలను గుర్తించి వీటికి దూరంగా ఉండాలి. ఇప్పటికే అలవాటైన వారు వైద్యుల సలహా, కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. పొగాకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు, నియంత్రణ చర్యలు చేపడతాం.

–డాక్టర్‌ బి.రాజారెడ్డి, డీఎంహెచ్‌ఓ

కట్టడికి కార్యాచరణ అవసరం...

పొగాకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు వైద్యశాఖ, పోలీస్‌, ఎకై ్సజ్‌, విద్యాశాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై నిఘా పెంచడం, అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకోవడం, గ్రామాలు, వార్డుల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్‌, డీ–అడిక్షన్‌ సేవలపై ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యువత ఈ అలవాట్లకు బానిస కాకుండా ముందస్తు అవగాహన, కౌన్సెలింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

–ఎం.పరశురాములు, సామాజికవేత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement