ఆ నలుగురు ఎక్కడ..? | - | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు ఎక్కడ..?

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

ఆ నలుగురు ఎక్కడ..?

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రుగల్లు కేంద్రంగా సాగిన సైబర్‌ నేరాల వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వ్యక్తులు వరంగల్‌ పరిసరాల్లో మకాం వేసి.. స్థానికంగా పరిచయాలు పెంచుకుని సైబర్‌ నేరాలకు అవసరమైన మ్యూల్‌ బ్యాంకు ఖాతాల వ్యవహారానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ కీలక నిందితులు నలుగురు ఎక్కడ? అనే చర్చ ఉత్కంఠ రేపుతోంది.

ఉమ్మడి వరంగల్‌లో పలువురితో దోస్తానా..

అరెస్టయిన 22 మందిలో గణనీయమైన సంఖ్యలో ఉమ్మడి వరంగల్‌ ప్రాంతానికి చెందినవారే ఉండటం కేసులో కీలక అంశంగా మారింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన నరేంద్ర హైల్‌, సంకల్ప్‌ ఖైతాన్‌, హషీమ్‌లు.. మరో నలుగురు వరంగల్‌లో మకాం వేశారు. వీరు హనుమకొండలోని భవానీనగర్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కూడా ఉన్నారు. దీంతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులకు స్థానికంగా ఎవరు సహకరించారు? పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? ఖాతాల సమకూర్చడంలో ఎవరి పాత్ర ఎంత? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

రెండు ఠాణాల్లో కేసులు..

కూపీ లాగితే కదిలిన డొంక..

మ్యూల్‌ ఖాతాలు, సైబర్‌ లింకులు, నేరాలకు సంబంధించిన ఈ వ్యవహారంపై మొదట వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నం.29/2026, ఆజంజాహీ మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నం.672/2026గా కేసులు నమోదయ్యాయి. నిందితులపై బీఎన్‌ఎస్‌ 316(2), 318(4), 319(2), 338, 336(3), 351(2), 111 ఆర్‌/డబ్ల్యు 3(5) సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌ 66–సి, 66–డి కింద కేసులు నమోదు చేశారు. అక్కడినుంచే విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతికత సహాయంతో అత్యంత గోప్యంగా నేరస్తుల కూపీ లాగారు. సైబర్‌ నేరాల్లో ఉపయోగించేందుకు బ్యాంకు ఖాతాలను సమకూర్చుకునే క్రమంలో స్థానికంగా పలువురిని సంప్రదించినట్లు కేసు వివరాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో నలుగురి కోసం ఇతర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. కమీషన్‌ ఇస్తామనే ఆశ చూపడం.. ఖాతాలు/బ్యాంకింగ్‌ వివరాలు సమకూర్చుకోవడం.. వాటిని నేర కార్యకలాపాలకు వినియోగించడం వంటి కోణాల్లో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలు, కొల్లగొట్టిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ దర్యాప్తు పూర్తయితే గాని తేలాల్సి ఉంది.

రాష్ట్రాల సరిహద్దులు దాటిన నెట్‌వర్క్‌..

ఈ కేసులో నిందితుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల అనుసంధానం కనిపిస్తోంది. బయట ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులు వరంగల్‌లో మకాం వేసి స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకున్నారా? లేక స్థానికంగా ఉన్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల నెట్‌వర్క్‌ సంప్రదించిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అరెస్ట్‌ చేసిన వారినుంచి లభించిన సమాచారం, బ్యాంకు ఖాతాలు, డిజిటల్‌ ఆధారాలు, ఫోన్‌ కమ్యూనికేషన్ల ఆధారంగా నెట్‌వర్క్‌లోని మిగిలిన వ్యక్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరారీలో ఉన్న నలుగురి ఆచూకీ లభిస్తే మ్యూల్‌ ఖాతాల వ్యవహారం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌, నగదు లావాదేవీలు, స్థానిక–అంతర్రాష్ట్ర సంబంధాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఓరుగల్లుకు ‘సైబర్‌’ లింకులు.. తిష్టవేసిన నేరస్తులు

ఢిల్లీ, హరియాణా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌

నుంచి వచ్చి మకాం

మ్యూల్‌ ఖాతాల బాగోతానికి శ్రీకారం

ఉమ్మడి జిల్లాకు చెందిన

పలువురితో దోస్తానా

కమీషన్‌ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టే స్కెచ్‌

గుట్టు రట్టు చేసిన వరంగల్‌ పోలీసులు

ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, యూపీకి

పోలీసు టీమ్‌లు

ఇంతకీ సూత్రధారులు ఎక్కడ?

ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్న ఖైతాన్‌ సుధాంశు, ఆమీర్‌ అలియాస్‌ జాన్‌, హేమరాజ్‌ బెహెరా, మహేష్‌ టాండీ ఇంకా పోలీసులకు చిక్కలేదు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకొచ్చిన పోలీసులు.. పరారీలో ఉన్న నలుగురి కోసం కూడా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement