సంగెం/పర్వతగిరి : పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్ష తీసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ సంతోష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మురళీనగర్‌కు చెందిన మాచర్ల ఆనంద్‌సాగర్.. 2020లో పీఎం కిసాన్ యోజన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని తాను ప్రాజెక్టు మేనేజర్‌గా, తన భార్య మాచర్ల సుష్మ మేనేజింగ్ డెరెక్టర్‌గా ఉంటూ ఐదుగురు ఉద్యోగులను నియమించుకున్నారు. వారితో గ్రామాల్లో కిసాన్ కార్డులు సేకరించి రైతులకు ట్రాక్టర్లు, టిల్లర్లు, రోటవేటర్లు వాహన రుణాలు, ఎరువులను సబ్సిడీపై ఇప్పించేవారు. ఈ క్రమంలో చాలామంది రైతులతో ఆ దంపతులకు పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో పలువురి ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసపూరిత మాటలు చెప్పేవారు. దీంతో ఏపీలో ఆనంద్‌సాగర్‌పై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్ 6న వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాజుకు ఆనంద్‌సాగర్ ఫోన్ చేసి పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రెండు దఫాలుగా రూ.లక్ష ఫోన్‌పే చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్ సైతం రాజుకు ఆనంద్‌సాగర్ పంపించాడు. ఈ క్రమంలో మోసపోయాయనని తెలుసుకున్న రాజు.. ఎన్‌సీఆర్‌బీలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆనంద్‌సాగర్‌ను విజయవాడలో అరెస్టు చేసి పర్వతగిరి సర్కిల్ కార్యాలయానికి తీసుకుని వచ్చి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సంతోష్ వివరించారు.


