నల్లబెల్లి: మనుమరాలిని చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సర్పంచ్ దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ సర్పంచ్ మృతిచెందగా, ఆమె భర్త మృత్యువుతో పోరాడుతున్న ఘటన కస్తూరిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం లెంకాలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి, రవీందర్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శివ – ప్రవళిక దంపతులకు రెండు నెలల క్రితం పండంటి బిడ్డ జన్మించింది. మనుమరాలును చూసేందుకు ద్విచక్రవాహనంపై కేసముద్రం మండలలోని తాళ్లపూసలపల్లికి సర్పంచ్ దంపతులు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి శివారులోని బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్పంచ్ విజయలక్ష్మి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడవగా, ఆమె భర్త రవీందర్ తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌ను పరామర్శించారు. అనంతరం, లెంకాలపల్లిలో విజయలక్ష్మి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, నాయకులు చెట్టుపల్లి మురళీధర్, ఊడుగుల ప్రవీణ్ గౌడ్, గందె శ్రీనివాస్ గుప్తా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పులి రమేష్, ఇస్తారి శేఖర్, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పరామర్శించారు.
చికిత్స పొందుతూ లెంకాలపల్లి
సర్పంచ్ విజయలక్ష్మి మృతి
మృత్యువుతో పోరాడుతున్న
సర్పంచ్ భర్త రవీందర్


