● పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బి.నర్సింహారావు
నర్సంపేట: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి ఫీజులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వాలను శాసిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతీ సంవత్సరం ఇష్టారాజ్యంగా 25 నుంచి 50 శాతం ఫీజులు పెంచుతున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల నరేశ్, సహాయ కార్యదర్శి దండు వినయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు హర్షవర్ధన్, పి.అనూష, నాయకులు రజని, సౌమ్య, రాజు, కల్యాణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


