ధాన్యం తడవకుండా చూడాలి : డీఆర్‌డీఓ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తడవకుండా చూడాలి : డీఆర్‌డీఓ

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

ఖానాపురం: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలని డీఆర్డీఓ నాగపద్మజ ఆదేశించారు. ఈ మేరకు రాగంపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. సేకరించిన ధాన్యం, తూకాలు, గన్నీల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం డీఆర్‌డీఓ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దని, వాతావరణంలో మార్పుల దృష్ట్యా ధాన్యాం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న డీసీఎం, ట్రాక్టర్ల ద్వారా తరలించాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అద్వైత, ఏపీఎం రమాదేవి పాల్గొన్నారు.

ఇరువర్గాల ఘర్షణ

చెన్నారావుపేట: వరిగడ్డి వాము దగ్ధమైన ఘటనలో లింగాపురం గ్రామ పరిధిలోని మేగ్యానాయక్‌తండాలో ఇరువర్గాలు శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగాయి. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం.. మేగ్యాతండాకు చెందిన గుగులోత్‌ రాజేందర్‌ వరిగడ్డి వాము ఇటీవల దగ్ధమైంది. దీంతో రాజేందర్‌ మనస్తాపం చెంది తిట్టాడు. ఇది విన్న అజ్మీరా శ్రీను ఎందుకు తిడుతున్నావని అడిగాడు. వరిగడ్డి కాల్చినవాడిని తిడుతుంటే నీకేమైందని రాజేందర్‌ అనడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా అజ్మీరా శ్రీను కత్తులు, ఇనుపరాడ్లతో నలుగురు వ్యక్తులను తీసుకుని రాజేందర్‌ ఇంటిపైకి దాడికి వెళ్లాడు. తండావాసులు వెంబడించడంతో ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. గణి అనే వ్యక్తి దొరకడంతో పక్కనే ఉన్న స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

చెన్నారావుపేట: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాపయ్యపేటలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పాపయ్యపేటకు చెందిన కొల్లూరి సతీశ్‌ (36) తన భార్య పిల్లలతో వరంగల్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య అనూషతో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంట్లో భార్య అనూష, అత్త ఐలమ్మ, బామ్మర్ది శివ.. సతీశ్‌తో గొడవపడి దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన సతీశ్‌ పాపయ్యపేటకు వచ్చి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఓదెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.

ఆయిల్‌పామ్‌ తోటలో అగ్నిప్రమాదం

వర్ధన్నపేట: ఆయిల్‌పామ్‌ తోటలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన ఇల్లంద గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు తక్కళ్లపల్లి లోకేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంద గ్రామంలో 8 ఎకరాల్లో మూడు సంవత్సరాలుగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నట్లు తెలిపాడు. తోటకు సమీపంలో రైతులు వరి కొయ్యలను తగుల బెట్టారు. మంటలు తోటలోకి విస్తరించి 400 మొక్కలు పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నాడు. మొక్కలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులు, వాల్వ్‌సిస్టం కాలిపోయినట్లు వాపోయాడు. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement