● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట/ ఖిలా వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలలో గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలను రేపటిలోగా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా రవాణాధికారి శోభన్‌బాబు, డీఎంసీఎస్ సంధ్యారాణి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
వరంగల్ చౌరస్తా/ఖిలా వరంగల్: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ పైడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు’పై శుక్రవారం అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్ వీడియోలు ప్రదర్శించారు. గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు 1,000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎర్లీ చైల్డ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆటబొమ్మలు, అభ్యసన సామగ్రి తయారీని వివరించారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మాట్లాడుతూ పిల్లల్లో సహజ సిద్ధమైన సృజనాత్మకతను ప్రోత్సహించాలని, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


