● నాలుగేళ్ల చిన్నారుల కోసం
ప్రీప్రైమరీ స్కూళ్లు
● 13 మండలాలకు 48 పాఠశాలలు
మంజూరు చేసిన ప్రభుత్వం
దుగ్గొండి: ప్రైవేట్, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోట్లాది రూపాయలతో వసతులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారు కోసం జిల్లాకు 48 పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గనుంది.
ఒక్కో పాఠశాలకు రూ.1.70 లక్షల నిధులు.
ప్రభుత్వం మంజూరు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాల (ప్రీ ప్రైమరీ స్కూల్)లో ఒక టీచర్, ఒక ఆయాను నియమించనున్నారు. టీచర్‌కు రూ.8వేలు, ఆయాకు 6వేల చొప్పున వేతనం అందిస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 96 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. పిల్లలకు ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పాలు, స్నాక్స్ అందిస్తారు. నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.1.70 లక్షల నిధులు మంజూరు చేసింది...
మండలాల వారీగా
పాఠశాలల మంజూరు వివరాలు..
జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. వీటిలో చెన్నారావుపేట, దుగ్గొండి, గీసుకొండ, ఖానాపురం, ఖిలా వరంగల్, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, మండలాలకు నాలుగు పాఠశాలల చొప్పున మంజూరయ్యాయి. కాగా, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట మండలాలకు 3 పాఠశాలల చొప్పున మొత్తం 48 పాఠశాలలు మంజూరయ్యాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 522 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27,729 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రాథమిక విద్య బలోపేతం..
ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంలో భాగంగా మండలానికి నాలుగు ప్రీప్రైమరీ స్కూళ్లు మంజూరయ్యాయి. గత సంవత్సరమే అడ్మిషన్లు ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించే తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు. ప్రీప్రైమరీతో ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడుతుంది.
– వెంకటేశ్వర్లు, దుగ్గొండి ఎంఈఓ


