దుగ్గొండి: నిరుపేద కుటుంబం.. ఉన్నదాంట్లో కష్టపడి ఇద్దరు కుమార్తెలను చక్కగా చదివిస్తున్నారు. ఇంతలోనే క్యాన్సర్ వారి పాలిట శాపమైంది. ఆ మహమ్మారి దంపతులను పొట్టనపెట్టుకుంది. ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఇప్పుడు వారి చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిర్ర రాజు–కవిత దంపతులది నిరుపేద కుటుంబం. ఇల్లు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం కవిత క్యాన్సర్ వ్యాధి బారినపడి మృతి చెందింది. రాజు కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు శ్రుతి, సౌమ్య దిక్కులేని వారయ్యారు. గ్రామస్తుల సహకారంతో తండ్రికి అంత్యక్రియలు చేసి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రుతి బీటెక్, సౌమ్య పదో తరగతి చదువుతోంది. తమకు తల్లిదండ్రులు దూరమయ్యారు, చదువు ఎలా కొనసాగించాలో తెలియడం లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మండలంలో 44 మందికి క్యాన్సర్..
దుగ్గొండి మండలంలోని 34 గ్రామ పంచాయతీల పరిధిలో 44 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 2023లో నలుగురు, 2024లో ముగ్గురు, 2025లో ముగ్గురు, 2026లో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. బాధితులు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదిస్తే ఉచితంగా పరీక్షలతో పాటు మందులు అందిస్తామని, తొలిదశ నుంచే మందులు వాడితే ప్రాణాపాయం ఉండదని మండల వైద్యాధికారి కిరణ్‌రాజు తెలిపారు.
కన్నవారిని కాటేసిన క్యాన్సర్ మహమ్మారి
15 ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి
కన్నీటిపర్యంతమవుతున్న
ఇద్దరు కుమార్తెలు
చదువు ఎలా కొనసాగించాలని
ఆందోళన


