పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షురూ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షురూ

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షురూ బల్దియా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బదిలీ 8 నుంచి బీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాడుదాం

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–27) ప్రవేశాలకు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న అభ్యర్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి ధ్రువీకరణ పత్రాలను అందించారు. జూన్‌1వ తేదీ వరకు ఈ సర్టిఫికెట్ల ప్రక్రియ కొనసాగనుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ బల్దియా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కర్ణాకర్‌ మంగళవారం బదిలీ అయ్యారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి బీఈడీ సెకండియర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) జూన్‌ 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసీం ఇక్బాల్‌ తెలిపారు. జూన్‌ 8, 9, 10, 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు.

విద్యారణ్యపురి: ‘ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాడుదాం’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కార్యనిర్వాహక కార్యదర్శి, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలోని ప్రభుత్వ సుబేదారి పాఠశాలలో నిర్వహించిన విద్యారంగ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ జూన్‌ 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి, డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ఆయా సంఘాల రాష్ట్ర బాధ్యులు రావుల రమేశ్‌, అటుకుల శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, జి.ఉప్పలయ్య, అన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి, కుమారస్వామి, రాంరెడ్డి, సుదర్శనం, శ్రీనివాస్‌రావు, సుదర్శన్‌ వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

సంప్రదాయాలు కాపాడాలి

హన్మకొండ కల్చరల్‌/హన్మకొండ: ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి అన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లిన మహాస్వామి.. తిరుగు ప్రయాణంలో హనుమకొండ హంటర్‌ రోడ్డులోని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వొడితల లక్ష్మీకాంతరావు స్వగృహానికి శుక్రవారం వెళ్లారు. స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కెప్టెన్‌ వొడితల లక్ష్మీకాంత రావు, సరోజనీ దేవి దంపతులు, మనుమడు ఇంద్రనీల్‌, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ దంపతులు స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారితో భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషుశర్మ, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ, పద్మాక్షి దేవాలయ అర్చకుడు నాగిళ్ల షణ్ముఖ శర్మ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement