● అధిక సాంద్రత పద్ధతిపై
ఆసక్తి చూపుతున్న రైతులు
● తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి
● ఖరీఫ్‌లో 1,10,200 ఎకరాల్లో సాగు విస్తీర్ణం అంచనా
● ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల
విత్తనాలు అవసరం
దుగ్గొండి: రోహిణి కార్తె త్వరలో ప్రారంభం కానుంది. రైతులు వానాకాలం పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా పత్తి పంట సాగు చేసేందుకు దుక్కులను పొతం చేస్తున్నారు. అయితే, సాధారణ పద్ధతిలో దిగుబడి రాక నష్టాల పాలవుతున్నారు. కొంతమంది వానాకాలంలో పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసి వదిలేస్తున్నారు. కాగా, ఈ ఖరీఫ్‌లో 1,10,200 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ తరుణంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుచేసి మంచి దిగుబడి సాధించవచ్చని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం అధికారులు తెలిపారు. సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు.
ఎకరాకు 25 వేల మొక్కలు అవసరం..
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి, తక్కువ సమయంలో అధిక దిగుబడిని సాధించే పద్ధతినే అధిక సాంద్రత పద్దతి (హెచ్‌డీపీఎస్) అంటారు. తేలిక నేలలు, ఎర్ర నేలలు, వాన ఆధారిత సాగుకు ఇది అనుకూలంగా ఉంటుంది. చిన్నగా గుబురుగా నిటారుగా పెరిగే విత్తన రకాలను ఎంచుకుని సాగు చేసుకోవాలి. సాధారణంగా వరుస వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో రైతులు పత్తి విత్తనాలు నాటుతుంటారు. ఈ పద్ధతిలో ఎకరాకు 7,407 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పద్ధతిలో రైతులు వరుస వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడంతో నాటుకుంటే ఎకరాకు 22 వేల నుంచి 25వేల మొక్కలు వస్తాయి. ఈ విధానం ద్వారా ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఒక్కో మొక్కకు 8 నుంచి 10 కాయలు వచ్చినా ఎకరాకు 10–12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
పెరుగుదల నియంత్రణ కీలకం..
అధిక సాంద్రత పద్ధతిలో వర్షాలు ఎక్కువగా కురిస్తే మొక్క పెరగకుండా మందులు పిచికారీ చేయాలి. మొక్కల పెరుగుదలను నియంత్రిస్తే కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా కాయ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకేసారి కాతకు వచ్చి కాయలు కాస్తాయి. ఒకేసారి పత్తి తీసుకునే అవకాశం కలుగుతుంది. పత్తి పెరుగుదల నియంత్రణ కోసం మెపిక్వాట్ క్లోరైడ్ మందును పంట వేసిన 40–45 రోజుల మధ్య, 60–65 రోజుల మధ్య లీటరు నీటికి 0.8 మిల్లీలీటర్ల మందు కలిపి పిచికారీ చేయాలి.
ఎరువుల యాజమాన్యం..
ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కిస్తే ఎకరాకు 100 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దీంతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేసుకుని భూమిలో కలియదున్నాలి.


