మరోసారి అప్‌డేట్ చేసుకోవాలి
● 95 శాతం ఈకేవైసీ పూర్తి
సంగెం : జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద చేపట్టే పనులు కూలీల బోగస్ హాజరుకు చెక్ పడనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. తద్వారా జాబ్‌కార్డులకు కూలీల ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు వారి నమోదు చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ పనులు 95 శాతం పూర్తి కావచ్చాయి. మండలంలో 10,972 మంది కూలీలు
మండలంలో 8007 జాబ్‌కార్డులుండగా 10972 మంది కూలీలున్నారు. ఇందులో ఇప్పటివరకు 10384 మందికి ఆధార్, ఈకేవైసీ పూర్తి అయ్యింది. ఇంకా 588 మందికి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో 116 మంది చనిపోగా, 52 మంది శాశ్వతంగా వలస వెళ్లారు. అలాగే 115 మంది తాత్కాలికంగా వలస వెళ్లగా 40 మంది వృద్ధులు, 183 మంది ఐరిష్ నమోదు కాని వారు, 33 మంది పని మానేసిన కూలీలున్నారు. మరో 49 మందికి మాత్రమే ఈకేవైసీ చేయాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు చొరవ చూపుతున్నారు.
పని ప్రదేశం వద్ద..
పని ప్రదేశం వద్ద కూలీల హాజరును ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేయడం ఆనవాయితీగా ఉండేది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు నకిలీ ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు నిర్ధారణ కాగా కేంద్రం ఎన్‌ఎంఎంఎస్ యాప్ తీసుకొచ్చింది. దీన్ని దుర్విని యోగం చేస్తున్నట్లు గుర్తించి నకిలీ హాజరు అరికట్టేందుకు ఈకేవైసీ విధానం అమల్లోకి తెచ్చింది.
తప్పులకు ఆస్కారం లేకుండా..
గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ బుక్) అమల్లోకి తీసుకొచ్చారు. పని ప్రదేశాల వివరాలను గుర్తించి ముందుగా లెక్కించి కొలత పుస్తకంలో రాసి తర్వాత ఆన్‌లైన్, ఈ–ఎంబీలో నమోదు చేయాల్సి ఉంటుంది.
సాంకేతిక ఇబ్బందులు..
ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమై దాదాపు ఏడు నెలల 10 రోజులు గడుస్తున్నా మండలంలో దాదాపు 95 శాతం వివరాల నమోదు పూర్తయ్యాయి. సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ–కేవైసీ నమోదులో జాప్యం జరుగుతోంది. కొందరి ఐరిష్ నమోదు కాకపోగా మరికొందరికి ఈ–కేవైసీ పూర్తి చేయలేకపోయారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఈ విధానం గురించి ఎఫ్‌ఏలకు, టీఏలకు అవగాహన కల్పించాము. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. కొందరి ఐరిష్ నమోదు కావడం లేదు. అలాంటి వారిని మరోసారి మీసేవ కేంద్రాల్లో ఆధార్ అప్‌డేట్ చేయించుకోమని సూచిస్తున్నాం.
– గణేశ్, ఏపీఓ


