రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్‌

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

గీసుకొండ: మొగిలిచర్ల రైతువేదికలో భూసార పరిరక్షణ కోసం కలెక్టర్‌ సత్యశారద వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులకు వానాకాలం సాగు విషయంలో దిశానిర్దేశం చేశారు. తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌, ఏఓ హరిప్రసాద్‌బాబు, బొడ్డుచింతలపల్లి సర్పంచ్‌ పోగుల వనితయుగేందర్‌, డీలర్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ బూసాని వేణుగోపాల్‌, ఏఈఓలు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

ఇళ్ల నమోదులో

నిర్లక్ష్యం వద్దు

నర్సంపేట: కేటాయించిన బ్లాక్‌లోని అన్ని రకాల ఇళ్లను నమోదు చేయడంలో ఎన్యుమరేటర్లు నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర సెన్సెస్‌ ఆపరేషన్‌ జేడీ సుబ్బరాజు అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డు, మాదన్నపేటలో ఇళ్ల జాబితా నమోదును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాపులు తయారు చేయడంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. జాబితాలో వివరాలు క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కాటం భాస్కర్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ సతీశ్‌, అడిషనల్‌ చార్జ్‌ ఆఫీసర్‌ విజేందర్‌, సూపర్‌వైజర్‌ సర్దార్‌, ఎన్యుమరేటర్‌ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాగేంద్రస్వామికి

ప్రత్యేక అలంకరణ

గీసుకొండ: హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఊకల్‌హవేలిలో ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని లక్ష తమల పాకుల (నాగవల్లి పత్రాల)తో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్ష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

15న వాహనాల

పాత విడిభాగాల వేలం

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పోలీసు వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15న (శుక్రవారం) వేలం వేయనున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ప్రభుత్వ పోలీస్‌ వాహనాలకు సంబంధించి రిపేర్‌ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషనరేట్‌ కార్యాలయంలోని మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ (ఎంటీఓ)లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 94402 42895, 99495 68320 నంబర్లలో సంప్రదించాలని సీపీ సూచించారు.

కొమ్మాల ఆలయ ధర్మకర్త శ్రీనివాసాచార్యులు మృతి

గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్‌ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు (85) మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసాచార్యులుతో పాటు వంశంలోని పూర్వీకుల హయాంలోనే ఆలయ ప్రాశస్థ్యం వెలుగులోకి వచ్చింది. శ్రీని వాసాచార్యులుకు వెంకటాచార్యులు, వేణుగోపాలాచార్యులు, దామోదరాచార్యులు కుమారులు, భార్య పద్మావతి ఉంది. రెండో కుమారుడు వేణుగోపాలాచార్యులు అర్చక వృత్తిలోనే కొనసాగి గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆలయం వద్ద ఉన్న ఇంటి వద్దకు సమీప గ్రామాలవారు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement