విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కాళోజీ సెంటర్‌: పదో తరగతిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే స్పెషల్‌ రెమీడియల్‌ సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యశారద తెలిపారు. వరంగల్‌ నరేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సంపేట బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంపులను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు నిరుత్సాహానికి గురికాకుండా తిరిగి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని క్యాంపులను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాశాఖ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ మూడో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. మొదటి రోజు గీసుకొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్‌ పాఠశాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ ఉండ్రాతి సుజన్‌ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ, జీహెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మొక్కజొన్నల కొనుగోళ్లకు చర్యలు

న్యూశాయంపేట: మొక్కజొన్నల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం పలు శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 16,546 మంది రైతుల నుంచి 201.81 కోట్ల విలువైన 84,090.9 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు కొనుగోల్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,37,250 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేయగా.. అందులో ఇప్పటికే 65,729 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న నిల్వచేసినట్లు తెలిపారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత నమోదు

భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా సభ్యత్వ నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు(క్రిమినల్‌ కేసులు లేనివారు) సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు. దరఖాస్తు ఫారం పూర్తిచేసి రెండు ఫొటోలు, ఆధార్‌కార్డు ప్రతితో పాటు శాశ్వత సభ్యత ఫీజు 1,100 రూపాయలు చెల్లించాలని సూచించారు. సభ్యత్వం పొందిన వారికి శాశ్వత సభ్యత్వ కార్డు అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 13 నుంచి 31 వరకు వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ వివరించారు.

మహిళలకు ఉపాధి కల్పించాలి

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులోని కిటెక్స్‌ కంపెనీలో 1800 స్టిచ్చింగ్‌ పోస్టుల భర్తీపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. టైలరింగ్‌పై పట్టు ఉన్న మహిళలను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు 12,300 నుంచి 21,800 వరకు వేతనం నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నరసింహామూర్తి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, కంపెనీ ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement