విద్యారణ్యపురి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కలిపి 16,424 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 32 మంది డిపార్ట్‌మెంటల్ ఆపీసర్లను, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను 23 మందిని నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్‌స్క్వా డ్ల బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌కు 93816 72094, 95027 43435లో సంప్రదించాలని గోపాల్ సూచించారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15న (శుక్రవారం) వేలం వేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ పోలీస్ వాహనాలకు సంబంధించి రిపేర్ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఎంటీఓ)లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 94402 42895, 99495 68320 నంబర్లలో సంప్రదించాలని సీపీ సూచించారు.
కేయూ క్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో ప్లేస్‌మెంట్ సెల్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు.
కాశిబుగ్గ: ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది పేషెంట్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సెస్ డే సందర్భంగా ఎంజీఎంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి, నర్సింగ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు అశ్విన్, ఎ.మధుకర్, నర్సింగ్ ఆఫీసర్ దయాశీల, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ వై.సుజాత, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీకేఎం ఆస్పత్రిలో...
వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రతిజ్ఞ చేశారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు స్వరూప, బేబీ రాణి, జ్యోతిర్మయి, మురళి, పద్మ, దిలీప్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు జి.రమణ, జి.వసంత లీల, ఉమారాణి, సుధ, అనిత, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


