సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

కాళోజీ సెంటర్‌: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 16 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడుతాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదల

విద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్‌ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత యోచించి ప్రవేశాలకు జారీచేసిన షెడ్యూల్‌ను నిలిపివేసిన విషయం విధితమే. అయితే ఆ నిర్ణయాన్ని (విలీన ప్రక్రియను) ప్రభుత్వం మార్చుకొని ఈఏడాది యథావిఽధిగానే ఇంటర్‌ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపింది. దీంతో ఇంటర్‌ బోర్డు తాజాగా అడ్మిషన్లకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, గురుకుల జూనియర్‌ కళాశాలల్లోనూ ప్రవేశాలు కల్పించన్నారు.

జూన్‌ 1 నుంచి తరగతులు..

మొదటి దశ ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్‌ కళాశాలల్లో ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్‌ 30 వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది. టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంట ర్నెట్‌ మార్కుల మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆ త ర్వాత ఒరిజనల్‌ టెన్త్‌ మెమోలు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

మ్యాపింగ్‌ ప్రక్రియను

వేగవంతం చేయాలి

న్యూశాయంపేట: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్‌ఐఆర్‌ జాబితాలో మ్యాపింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. అన్ని నియోజక వర్గాల్లో రానున్న 15 రోజుల్లో కనీసం 90శాతం మ్యాపింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్‌ పురోగతిని పెంచేందుకు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల సహకారాన్ని వినియోగించుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రేపటి నుంచి

కాకతీయ కళల జాతర

నయీంనగర్‌: కాకతీయ కళల జాతర ఈ నెల 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపకుడు, పూర్వ ఫిలిం సెన్సార్‌బోర్డ్‌ మెంబర్‌, రచయిత గాయకుడు ఆకుల నాగేశ్వర్‌ తెలిపారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు, భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న మొదటి రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాశ్‌ హాజరవుతారన్నారు. అనంతరం కళల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సహ కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాంకుమార్‌, బూరం ప్రశాంత్‌, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు శివ, రాజేశ్‌, సునీల్‌ రావు, శ్రీనివాస్‌ రెడ్డి, రాజి రెడ్డి, దేవేందర్‌, అమర్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement