విద్యార్థుల విజయం జిల్లాకే గర్వకారణం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల విజయం జిల్లాకే గర్వకారణం

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్‌: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన విజయాలు జిల్లాకే గర్వకారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్‌ హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో (యంగ్‌ ఆచీవర్స్‌ సన్మాన కార్యక్రమం) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డీఓ సుమ హాజరై 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్‌లో 980 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులతో పాటు రెండుసార్లు చదరంగం పోటీల్లో ప్రపంచ రికార్డు సాధించిన శ్రీయాంశ్‌ మురళీకృష్ణను మెడల్స్‌, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చదువుకు వయస్సుతో సంబంధం లేదని, లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కలలు కనండి ఆ కలలను నిజమయ్యేలా కష్టపడాలాన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇగ్బాల్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు భాగ్యలక్ష్మి, పుష్పలత, రమేష్‌, నారాయణరెడ్డి, డీవైస్‌ అనిల్‌, అధ్యాపకులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement