సమస్యలు తెలిపారు.. పరిష్కరించారు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తెలిపారు.. పరిష్కరించారు

May 10 2026 7:28 AM | Updated on May 10 2026 7:28 AM

వెంటనే స్పందించిన మున్సిపల్‌

చైర్‌పర్సన్‌, కమిషనర్‌

పైప్‌లైన్‌ లీకేజీలు, మరమ్మతులే ఎక్కువ..

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి

విశేష స్పందన

నర్సంపేట: నర్సంపేట మున్సిపాలి టీ పరిధిలో నెలకొన్న సమస్యల ను పరిష్కరిస్తామని చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌, ము న్సిపల్‌ కమిషనర్‌ కాటం భాస్కర్‌ తెలిపారు. శనివారం వేసవిలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో పలువురు సమస్యలు తెలుపగా వెంటనే పరిష్కరించారు. పట్టణంలోని 62 మంది ప్రజలు, ప్రముఖులు స్పందించి పలు సమస్యలు తెలుపగా దాదాపుగా 40 శాతం సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని, వస్తున్న ఏరియాలో పైపులైన్‌ లీకేజీ సమస్యలు ఉన్నాయని తెలపడంతో చైర్‌పర్సన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నీటి సరఫరా సిబ్బందితో మాట్లాడి గంట వ్యవధిలో సమస్యను పరిష్కరించేందుకు సిబ్బందిని కేటాయించి పనులు చేయించారు. దీంతో పట్టణానికి చెందిన జోషి రమేశ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దార్ల సరస్వతి సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో పలువురు అడిగిన సమస్యలకు చైర్‌పర్సన్‌ లక్ష్మీరామానంద్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ కాటం భాస్కర్‌లు ఈ విధంగా సమాధానాలు చెప్పారు.

ప్రశ్న: పైపులైన్‌ లీకేజీకి గుంత తీశారు..పూడ్చడం మరిచారు.

– అపరాదపు సంపత్‌, 24వ వార్డు, పెరుమాళ్ల ఎల్లయ్య, 23వ వార్డు,

జవాబు: పెద్ద పైపులైన్‌ పగిలిపోవడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 27వ వార్డు కౌన్సిలర్‌ ములుకల సాంబయ్య ఇంటి సమీపంలో ఏర్పడిన గుంతను తక్షణమే పూడ్చి వేయిస్తాం. 23వ వార్డులో రెండు రోజుల్లో నీటి సరఫరా చేస్తా.

ప్రశ్న: రెండు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది.

– బెజ్జంకి ప్రభాకర్‌, బీరం భాస్కర్‌

జవాబు: 28వ వార్డులో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ వేసినప్పటికీ మెయిన్‌ పైప్‌లైన్‌ లింకేజీ చేయలేకపోయాం. త్వరలో సమస్యలు పరిష్కరించి తాగునీరు అందిస్తాం.

ప్రశ్న: గతంలో వచ్చే నీరు ఇప్పుడు రావడం లేదు.

– బొమ్మెర సతీష్‌, 25వ వార్డు

జవాబు: ద్వారకపేట రోడ్డులో ఏర్పడిన గుంతను పూడ్చి మరమ్మతు చేస్తున్నాం. రెండు రోజుల్లో సమస్య లేకుండా కృషి చేస్తాం.

ప్రశ్న: 26వ వార్డులో బోరు రిపేరు చేయించడం లేదు.

– నాడెం రామకృష్ణ, 26వ వార్డు

జవాబు: 26వ వార్డులోని జయశ్రీ టాకీస్‌ సమీపంలోని కడారి చంద్రయ్య ఇంటి ముందు ఉన్న బోరు రిపేరు రావడంతో 4రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన సామగ్రి వచ్చింది. రెండు రోజుల్లో బోరు రిపేరు చేసి నీటి సరఫరా చేస్తాం. దీని కోసం మున్సిపాలిటీ సిబ్బంది సదానందంను పంపిస్తున్నాం.

ప్రశ్న: పైప్‌లైన్‌ లీకేజీ అవుతుంది. మరమ్మతు చేయాలి?

– మఠారి విఠల్‌, 27వ వార్డు

జవాబు: వెంటనే రిపేరు చేయిస్తాం. సిబ్బందిని పంపిస్తామంటూ.. సిబ్బందిని సంఘటనా స్థలానికి వెంటనే పంపించారు.

ప్రశ్న: పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించడం అభినందనీయం. ఎప్పుడైన అధికారుల దృష్టికి వచ్చి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

–గోకా రామస్వామి, వనప్రేమి అవార్డు గహీత

జవాబు: అందరి సహకారంతో ప్రతీ సమస్యను పరిష్కరిస్తున్నాం. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచన మేరకు అశోక్‌నగర్‌లోని ఢీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్టు నుంచి రానున్న రోజుల్లో నీటి సమస్య లేకుండా రూ.50లక్షల నిధులతో పట్టణానికి తాగునీటిని అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం.

ప్రశ్న:మఽగ్ధుంపురంలో ఇబ్బందులుఅవుతున్నాయి?

– కోల కిరణ్‌కుమార్‌, కె.సదానందం

జవాబు: మున్సిపాలిటీ పరిధిలోని 11వార్డు మగ్ధుంపురంలో నీటి సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. సిబ్బందిని మార్చి ప్రత్యేక వసతులు కల్పిస్తాం.

ప్రశ్న: మిషన్‌ భగీరథ పథకంతో ఉపయోగం లేదు

– వాజిత్‌, 17వ వార్డు

జవాబు: పట్టణానికి రావాల్సిన భగీరథ తాగునీటిలో తక్కువ శాతం రావడం వల్ల అన్ని వార్డులకు అందించలేక పోతున్నాం. ఎమ్మెల్యే సహకారంతో వచ్చే సీజన్‌లో సమస్యను అధిగమించి అమృత్‌ పథకాన్ని అనుసంధానం చేసి పట్టణం మొత్తం తాగునీ రు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

ప్రశ్న: అధికారులకు అవగాహన ఉండడం లేదు. సమస్యలు పరిష్కారం కావడం లేదు?

– నాడెం శాంతికుమార్‌,

మాజీ ఖనిజాభివృద్ధి శాఖ డైరెక్టర్‌, 25వ వార్డు

జవాబు: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. మున్సిపాలిటీ పాలక వర్గం ఇటీవల బాధ్యతలు స్వీకరించింది. 25వ వార్డుతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతున్నాం. సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement