కేఎంటీపీకి ‘పీఎం మిత్ర’ బూస్ట్‌ ఇచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

కేఎంటీపీకి ‘పీఎం మిత్ర’ బూస్ట్‌ ఇచ్చేనా?

May 10 2026 7:28 AM | Updated on May 10 2026 7:28 AM

భారీగా నిధులు మంజూరు చేస్తేనే

అభివృద్ధి, ఉపాధి

నేడు పీఎం మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆశలు

గీసుకొండ: గీసుకొండ, సంగెం మండలాల్లో నెలకొల్పిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు (కేఎంటీపీ) అభివృద్ధి ‘పీఎం మిత్ర’ నిధులతో ముడిపడి ఉంది. నిధులు భారీగా మంజూరు చేస్తేనే పార్కులో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాకాలు అందే అవకాశం ఉంటుంది. ప్రధాని మోదీ 2023 మార్చి 17న కేఎంటీపీని ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌’ (పీఎం మిత్ర) కింద ఎంపిక చేశారు. పార్కులో యూనిట్లను ఏర్పాటు చేసుకునే కంపెనీలకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలను పీఎం మిత్ర ద్వారా అందించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ‘ఎక్స్‌’ వేదికగా పీఎం మోదీ ఈ నెల 10న కేఎంటీపీని హైదరాబాద్‌లో వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. ఈ ప్రాజెక్టును రూ.1,695.54 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. కేఎంటీపీ ప్రాజెక్టుతో రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తుండగా ఇప్పటికే రూ.3,800 కోట్లకు పైగా వచ్చినట్లు వెల్లడించారు. పార్కు అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం మూడు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి.

కేఎంటీపీ పరిశ్రమల సందర్శన

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు (కేఎంటీపీ)లో నెలకొల్పిన కై టెక్స్‌, యంగ్‌వన్‌, గణేశా కంపెనీలను భారత ప్రభుత్వ టెక్స్‌టైల్‌ మంత్రిత్వశాఖ సెక్రటరీ నీలం శమిరావు శనివారం సందర్శించారు. ఆయా కంపెనీల్లో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, కార్మిక సంక్షేమ చర్యలు, పారిశ్రామిక అభివృద్ధిని పరిశీలించారు. కంపెనీల పనితీరు, నిర్వహణ పద్ధతులు బాగున్నాయని ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement