ఖానాపురం: అశోక్‌నగర్‌లోని కూల్చివేసిన శివాలయానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని ఆర్కియాలజీ వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి అన్నారు. ఈ మేరకు కూల్చివేసిన శివాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి ఆలయాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆర్కియాలజీ పరిధిలో 25 దేవాలయాలు ఉన్నాయని, ఈ శివాలయాన్ని కూడా ఆర్కియాలజీ పరిధిలోకి తీసుకురావడానికి కృషిచేస్తామని, శివాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు కేఎంటీపీకి కేంద్ర టెక్స్‌టైల్ సెక్రటరీ రాక
గీసుకొండ: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)కు పీఎం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్ సెక్రటరీ నీలం శామీరావు శనివారం రానున్నట్లు గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె కేఎంటీపీని పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కలెక్టర్ సత్యశారద, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామినాయక్ పాల్గొంటారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా శామీరావు కేఎంటీపీకి వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పీఎం మోదీ వర్చువల్‌గా కేఎంటీపీకి సంబంధించిన పలు ప్రారంభోత్సవాలు, కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫోన్లు, సిమ్‌లు తిరిగి
ఇచ్చేయండి
తాజా మాజీ కార్పొరేటర్లకు సమాచారం
వరంగల్ అర్బన్: తాజా మాజీ కార్పొరేటర్లు తమ మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు వెనక్కి ఇవ్వాలని బల్దియా సిబ్బంది శుక్రవారం వారికి సమాచారం అందించారు. పలువురు మాజీ కార్పొరేటర్లకు ఫోన్ చేసి, ప్రధాన కార్యాలయంలో అందించాలని సూచించారు. దీంతో హైరానా పడిన కొంత మంది మాజీ కార్పొరేటర్లు గతంలో ఎన్నాడు లేని విధంగా ఇదేంటి అంటూ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 2010, 2021 పాలకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, కొత్త విధానం ఏంటని విన్నవించినట్లు సమాచారం. తమ సిమ్‌లకు సంబంధించిన బిల్లు బల్దియా కట్టాల్సిన అవసరం లేదని, మేం చెల్లించుకుంటామని, కానీ సిమ్‌లు, ఫోన్లు వెనక్కి తీసుకోవడం ఏంటని కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదేళ్లుగా ప్రజా సేవ చేశామని, ఆ నంబర్‌తో అనేక కార్యకలాపాలు ముడిపడి ఉన్నాయని, వెనక్కి ఇవ్వాలని కోరడం సరికాదని తాజా మాజీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు వెనక్కి తీసుకోవద్దని బల్దియా అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలిసింది.
రేపు జిల్లా రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభం
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని అధికారులు తెలిపారు.


