● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మార్కెట్‌లో ధాన్యం తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వేగవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు త్వరితగతిన చెల్లించే విధంగా చూడాలని, ప్రతిపక్షాల నాయకులు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
కోనారెడ్డి చెరువును అభివృద్ధి చేస్తాం
కోనారెడ్డి చెరువు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కోనారెడ్డి చెరువు కట్టపై నిర్మించిన ఆలయంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, దీపాలను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి ప్రారంభించారు.


