సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి
భీమదేవరపల్లి: రైతులు పంట నూర్పిడి చేసుకునేందుకు సరైన వసతులు లేక రోడ్లనే కల్లాలుగా వాడుకుంటున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామదేవతల ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు. ఐకేపీ ద్వారా మొదట ఆన్‌లైన్ అని, ఆ తర్వాత ఆఫ్‌లైన్ అని మార్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానివి కేవలం మాటలే తప్ప, క్షేత్రస్థాయిలో చేతలు లేవని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పరిస్థితి ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదరి శ్రీనివాస్, పలువురు నేతలు, రైతులు పాల్గొన్నారు.


