బాలికల భద్రతకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాలికల భద్రతకు కృషి చేయాలి

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత

సంగెం: బాలికల భద్రతకు సమాజంలోని ప్రతీఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని తీగరాజుపల్లిలో తెలంగాణ పోలీస్‌ ఉమెన్‌ సెఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో మైచాయిస్‌ ఫౌండేషన్‌, యంగిస్తాన్‌ స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలపంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ కవిత హాజరై మాట్లాడుతూ బాలపంచాయతీల ద్వారా బాలల్లో అవగాహన పెంపొందించి వారి హక్కులు, భద్రతపై చైతన్యం తీసుకురావాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే బాలల సమస్యలను నిర్భయంగా వినిపించే వేదికగా బాల పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, ఆన్‌లైన్‌ వేధింపుల తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తేనే బాలలకు సురక్షిత వాతావరణం కల్పించవచ్చునన్నారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, బాలల భద్రతకు బాల పంచాయతీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీగరాజుపల్లిని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేష్‌, పర్వతగిరి సీఐ రాజగోపాల్‌, ఏహెచ్‌టీయూ సీఐ శ్యాంసుందర్‌, షీటీం సీఐ సుజాత, భరోసా సీఐ సువర్ణ, ఎస్సై ప్రవీణ్‌, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, డీఎల్‌పీఓ వేదవతి, ఎంపీఓ హర్షిత్‌, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ వసుధ, జన్ను క్రాంతి, ఎర్ర శ్రీకాంత్‌, సహాయ, కరుణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement