డాక్యుమెంట్‌ రైటర్లు! | - | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్‌ రైటర్లు!

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

డాక్యుమెంట్‌ రైటర్లు!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్‌ చేసి కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్‌లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్‌ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

వసూళ్లపర్వం తతంగం ఇలా...

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్‌కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్‌ ఆర్వో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్‌ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్‌ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబా బాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్‌లు అవుతుండగా, లేఅవుట్‌ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్‌, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఏసీబీ దాడులు.. సస్పెన్షన్లకు వెరవని పరిస్థితి..

వరంగల్‌, హనుమకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూ.42లక్షలకు పైగా డిజిటల్‌ (యూపీఐ) లావాదేవీలు జరిగినట్లు ఈ నెల 2న తనిఖీలు నిర్వహించిన ఏసీబీ తేల్చింది. దావులూరి ఆనంద్‌ (సబ్‌ రిజిస్ట్రార్‌–2), జమాలపురం రామనర్సింహారావు (సబ్‌ రిజిస్ట్రార్‌–1)లను అరెస్టు చేసి జైలుకు పంపారు.

గతంలోనూ నిబంధనలకు విరుద్ధంగా 26 ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశారని ఖిలా వరంగల్‌ ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

భూముల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన వివాదంలోనే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌పై కూడా అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ద్వారా రూ.19,200లు స్వీకరిస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా నస్రీన్‌ రూ.2.94 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

2025 నవంబర్‌ 28న వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్‌ కోసం కారు డ్రైవర్‌ ద్వా రా రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పెద్దవంగర తహసీల్దార్‌, జాయింట్‌ రిజిస్ట్రార్‌ వీరగంటి మహెందర్‌ను ఏసీబీ పట్టుకుంది.

ఇలా ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి నిత్యం ఏసీబీ దాడులు, విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైగా అవినీతి ఆరోపణలున్న వారికే సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌)లుగా పోస్టింగ్‌లు ఇస్తున్న ఉన్నతాధికారుల తీరుపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే..

అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

ఉమ్మడి వరంగల్‌లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్‌ వేటు పడిన

మారని తీరు

విజిలెన్స్‌ తనిఖీలకూ వెరవని

అధికారులు..

తాజాగా సోమవారం

జనగామలో తనిఖీలు

Advertisement
 
Advertisement
Advertisement