స్వీయ గణనలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనలో భాగస్వాములు కావాలి

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

నర్సంపేట: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్‌ సర్వే ప్రక్రియలో పట్టణ ప్రజలందరూ స్వీయగణన (సెల్ప్‌ ఏంయూమరేషన్‌) చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాట్లాడారు. ప్రతీ కుటుంబం తమ మొబైల్‌, కంప్యూటర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలన్నారు. స్వీయగణన ప్ర క్రియ ఏప్రిల్‌ 26 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కాటం భాస్కర్‌, డీవైఎస్‌ఓ అడిషనల్‌ చార్జ్‌ ఆఫీసర్‌ విజేందర్‌, వార్డు ఆఫీసర్లు సుష్మ, జనగణన సర్వే అధికారుల, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

నెక్కొండ: రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ముదిగొండ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పున్నం రంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రవణ్‌కుమార్‌ మాట్లాడారు. వివిధ పంటల్లో అధిక యూరియా వాడకంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల విచక్షణ రహితంగా వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూసారాన్ని కాపాడాలని, సాగు నీటిని ఆదా చేయాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని సూచించారు. ఈ సమావేశంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రావుల హరీశ్‌రెడ్డి, ఏఓ నాగరాజు, ఏఈఓ నవీన్‌, అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మక్కల కొనుగోలులో జాప్యంపై ధర్నా

చెన్నారావుపేట: మక్కల కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, వెంటనే కొనుగోలులో వేగం పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. మండలకేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులు కావస్తున్న నేటికి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, కన్వీనర్‌ జక్క అశోక్‌ ఆరోపించారు. వెంటనే పూర్తి స్థాయిలో మక్కల కొనుగోలు చేసి, గోదాముకు తరలించాలని లేదంటే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్నాతో వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై రాజేష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోని ధర్నా విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీయూ నాయకుడు రమేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు వంశీ, కుమార్‌, మల్లయ్య, సాంబయ్య, సర్పంచులు సుదర్శన్‌, రమేష్‌, సుధాకర్‌, ప్రదీప్‌, నరేందర్‌, రైతులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవా లు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవా రం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, డోలోత్సవం నిర్వహించారు. ఉద యం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం పద్మశాలి సంఘం వరంగల్‌, హనుమకొండ, గ్రేటర్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్‌ గుండు సుధారాణి, ప్రభాకర్‌ దంపతులు, ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement