విధుల్లో చేరిన ట్రెయినీ ఐఏఎస్‌ సాయి శివాని | - | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన ట్రెయినీ ఐఏఎస్‌ సాయి శివాని

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

విధుల్లో చేరిన ట్రెయినీ ఐఏఎస్‌ సాయి శివాని 1 నుంచి లలిత కళల్లో శిక్షణ జంక్షన్‌ ప్రతిపాదిత స్థల పరిశీలన 30న జాబ్‌ మేళా రాష్ట్ర సాధన ఘనత కేసీఆర్‌దే.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

హన్మకొండ అర్బన్‌: శిక్షణలో భాగంగా ట్రెయినీ ఐఏఎస్‌ అధికారి సాయి శివాని సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో విధుల్లో చేరారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో పలువురు అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణలో భాగంగా పరిపాలన, రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రయోగిక అవగాహన పొందేందుకు ట్రెయినీ ఐఏఎస్‌ సాయి శివాని వివిధ శాఖల పనితీరును పరిశీలించనున్నారు.

హన్మకొండ చౌరస్తా: మే 1 నుంచి జూన్‌ 5 వరకు బాలబాలికలకు లలిత కళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా బాలభవన్‌ సూపరింటెండెంట్‌ ఝాన్సీ ఒక ప్రకటనలో తెలిపారు. మృదంగం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల తరగతులు కొనసాగుతాయని, 5 నుంచి 16 సంవత్సరాల వయస్సున్న బాలబాలికలు అర్హులని తెలిపారు. వివరాలకు జిల్లా బాలభవన్‌, హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 99125 00516 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

హసన్‌పర్తి: హనుమకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని అన్నాసాగరం క్రాస్‌ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమాయత్తమయ్యారు. అన్నాసాగర్‌ క్రాస్‌ వద్ద జంక్షన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి క్షేత్రస్థాయిలో జంక్షన్‌ ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. క్రాస్‌ వద్ద జంక్షన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ‘కుడా’ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీఓ అజిత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: హనుమకొండ అంబేడ్కర్‌ విగ్రహం ప్రాంతంలోని ఐసీఎస్‌ఎస్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌లో ఈనెల 30న జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్లు డీఐఈఓ గోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26లో 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన బీపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు వేతనంతోపాటు ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చని, 30న ఉదయం 11:30 గంటలకు జాబ్‌మేళాలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.

హన్మకొండ: కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొని, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ‘కుడా’ మాజీ చైర్మన్‌, తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మర్రి యాదవ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సిరాజుద్దీన్‌, తాళ్లపల్లి జనార్దన్‌, నయీముద్దీన్‌, శ్రీధర్‌రావు, ప్రశాంత్‌, రఘు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామన్నపేట : నగరంలోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ సుమన్‌పై సోమవారం సస్పెన్షన్‌ వేటు పడింది. పోగొట్టుకున్న మొబైల్స్‌ను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా అప్పగించే నేపథ్యంలో కానిస్టేబుల్‌ సుమన్‌ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు నెల రోజుల క్రితం బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాల మేరకు విచారణ జరపగా ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని సస్పెండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement