భీమదేవరపల్లి: మండల పరిధి చంటయ్యపల్లిలో సోమవారం సాయంత్రం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. హై ఓల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన నుగూరు సంపత్‌రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. మంటల ధాటికి ఇంట్లోని టీవీలు, బట్టలు కుట్టే మిషన్లు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. గ్రామంలో సుమారు 30 నుంచి 40 విద్యుత్ మీటర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. గ్రామ పంచాయతీ వీధి దీపాలకున్న బల్బులు, కనెక్షన్లు కాలిపోయాయి. గ్రామంలోని సుమారు 15 విద్యుత్ లైన్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రతీ ఇంట్లో హైవోల్టేజీ కారణంగా టీవీలు, ఫ్రిజ్జులు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్లు కాలిపోయాయి. కాగా, ఈ ప్రమాదంపై కొత్తకొండ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. 6.3 కేవీ లైన్ పిన్, ఇన్సులేటర్‌పై ఒక పక్షి వాలడం వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి మీటర్లు, పరికరాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
రూ.2 లక్షల ఆస్తి నష్టం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యవసాయం, పాడి మీద ఆధారపడి జీవించే నాకు పశుగ్రాసంతో పాటు, ఇంట్లో ఉన్న కుట్టు మిషన్, వాషింగ్ మిషన్, టీవీ, విద్యుత్ మీటర్, వైర్లు, ఎలక్ట్రానిక్ సంబంధిత పరికరాలు మొత్తం ధ్వంసమయ్యాయి. సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– సంపత్ రెడ్డి, రైతు, చంటయ్యపల్లి
గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ నష్టం
ఎలక్ట్రానిక్ పరికరాలు,
విద్యుద్దీపాలు దగ్ధం


