● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జనగణన ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్‌కి స్వీయ గణన ఎలా చేయాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జనగణన 2027లో భాగంగా జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి 14 చార్జెస్‌లోని 1,237 హౌస్‌లిస్టింగ్ బ్లాక్‌లో 1,094 ఎన్యుమరేటర్లతో జనగణన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయగణనలో భాగంగా కేంద్రం తొలిసారిగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ఎస్‌ఈ. సీఈఎన్‌ఎస్‌యుఎస్. జీఓవీ.ఇన్ లింక్‌ను ఓపెన్ చేసి సెల్ప్ ఎన్యుమరేషన్ ద్వారా లాగిన్ అవ్వాలన్నారు. కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని, అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మరోసారి పరిశీలించి సమర్పించాలన్నారు. సమర్పణ అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినపుడు ఐడీని చూపిస్తే ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు బి.సంధ్యారాణి, వై.వి.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు.
వాసవీ మాత జయంతి
కలెక్టరేట్‌లో ఆదివారం వాలవీ మాత జయంతి సందర్భంగా కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు వాసవీ కన్యకా పరమేశ్వరీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళలులర్పించారు. వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు ఆర్యవైశ్యులు అన్నారు.
బడి బయట పిల్లలను గుర్తించాలి
వర్ధన్నపేట: బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాల ని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఇల్లందలోని బుడగ జంగాల కాలనీలో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పిల్లల వివరాలు, పత్రాలను పరిశీలించి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ గ్రామస్తులు పాల్గొన్నారు.


