● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జనగణన ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్‌కి స్వీయ గణన ఎలా చేయాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జనగణన 2027లో భాగంగా జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి 14 చార్జెస్‌లోని 1,237 హౌస్‌లిస్టింగ్ బ్లాక్‌లో 1,094 ఎన్యుమరేటర్లతో జనగణన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయగణనలో భాగంగా కేంద్రం తొలిసారిగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ఎస్‌ఈ. సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీఓవీ.ఇన్ లింక్‌ను ఓపెన్ చేసి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా లాగిన్ అవ్వాలన్నారు. కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని, అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మరోసారి పరిశీలించి సమర్పించాలన్నారు. సమర్పణ అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఐడీని చూపిస్తే ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వై.వి.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు.


