వరంగల్ అర్బన్: ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్ )కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదివారం 28వ డివిజన్న్లోని తన నివాసంలో స్వీయ గణన వివరాలు నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా గణాంక అధికారి మేయర్ నివాసానికి వెళ్లి అవసరమైన వివరాలు సేకరించి నమోదు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయ జన గణన కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మే 10 లోగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ అనంతరం జనరేట్ అయ్యే ఐడీ నంబర్ భద్రపర్చుకోవాలని కోరారు. మున్సిపల్ పరిధి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఇందులో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, మెప్మా టీఎంసీ రమేశ్, సీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


