హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.


