ఉమ్మడి జిల్లాలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో ఇలా..

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

మొత్తం సహకార సంఘాలు 98

సభ్యులు 2,96,077

డైరెక్టర్‌ స్థానాలు 1,260

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్‌లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎంఎస్‌)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఆశావహులు ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

ఇదీ పీఏసీఎస్‌ల లెక్క... ఇన్‌ఛార్జ్‌ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్‌ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్‌ పోస్టులు, 98 వైస్‌ చైర్మన్‌ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్‌ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్‌ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఎన్నికల నుంచి ‘నామినేటెడ్‌’ వైపు...

సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్‌ కమిటీల తరహాలో నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్‌ కమిటీ తరహా నియామకం’. త్వరలోనే నామినేటెడ్‌ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్‌ డైరక్టర్‌ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నామినేటెడ్‌ ద్వారానే ‘సహకార’ పదవులు

ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం

‘పరిషత్‌’ ఎన్నికలకు ముందే ప్రకటన

ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలు

జిల్లాల వారీగా ఇలా..

జిల్లా పీఏసీఎస్‌లు డైరక్టర్‌ సభ్యులు

స్థానాలు

వరంగల్‌ అర్బన్‌

(హనుమకొండ) 12 156 30,317

వరంగల్‌ రూరల్‌

(వరంగల్‌) 31 402 94,967

జనగామ 14 182 50,862

మహబూబాబాద్‌ 19 234 69,830

జేఎస్‌భూపాలపల్లి 10 130 22,773

ములుగు 12 156 27,328

Advertisement
 
Advertisement
Advertisement